● రూ.11.62 లక్షల బంగారం స్వాధీనం
● ముఠాగా ఏర్పడిన ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులు
మదనపల్లె టౌన్ : పీలేరు నియోజకవర్గంలోని వేర్వేరు మండలాల్లో వరుసగా చైన్ స్నాచింగ్‌లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్, ఏఎస్పీ వేంకటాద్రి, డీఎస్పీలు పావని, కృష్ణమోహన్‌లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి, ఎస్సైలు తిప్పేస్వామి, రవీంద్రబాబు, సీసీఎస్ క్రైమ్ బృందం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. వాల్మీకిపురంలోని మదనపల్లి తిరుపతి హైవే రోడ్డు, ఏటిగడ్డ శివాలయం సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,62,500 విలువైన 77 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠా నాయకుడు జరిపిటి రెడ్డెప్ప (30), రొంపిచర్లకు చెందిన పెద్దకోట్ల సుబ్రమణ్యం (38), కేవీపల్లెకు చెందిన అరవలోకేష్ (32), వాల్మీకిపురం, మదనపల్లికి చెందిన బర్లపల్లి అంజలి, సుజాత(45)లు ముఠాగా ఏర్పడి మహిళలతో మాట కలిపి మోసం చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే వారు.
జల్సాల కోసమే నేరాలు
నిందితులు రెడ్డెప్ప, సుబ్రమణ్యం, లోకేష్ ముగ్గురు స్నేహితులు. తమ విలాసాలకు, చెడు అలవాట్లకు డబ్బు సరిపోకపోవడంతో సులభంగా సంపాదించేందుకు దొంగతనాల బాట పట్టారు. వీరు గుర్రంకొండ, వాయల్పాడు, రొంపిచెర్ల, కలకడ మండలాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే వారు. చోరీ చేసిన సొత్తును దాచడంలో మహిళా నిందితులు అంజలి, సుజాత సహకరించే వారని పోలీసుల విచారణలో తేలింది.
చైన్ స్నాచర్స్ నుంచి వివిధ కేసులకు సంబంధించి 77 గ్రాముల బంగారంతోపాటు చైన్లు, ఉంగరాలు, చెంప సరాలు స్వాధీనం చేసుకున్నారు. గుర్రంకొండ, వాయల్పాడు, కలకడ, రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లలో నమోదైన ఆరు కేసులను ఛేదించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
పోలీసు సిబ్బందికి ప్రశంసలు
చైన్ స్నాచింగ్ ముఠాను పట్టుకున్న వాయల్పాడు సీఐ బి.రాఘవరెడ్డి, ఎస్సైలు తిప్పేస్వామి, రవీంద్రబాబు, రమేష్‌తోపాటు సిబ్బంది అబ్దుల్లా, రాఘవరెడ్డి, దొరబాబు, రవీంద్ర నాయక్, సుబ్రమణ్యంలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


