వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

కూలీని హత్య చేసిన మేస్త్రీ

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

మదనపల్లె టౌన్‌ : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కూలీని మేసీ్త్ర హత్య చేశాడు. ఈ కేసులో నిందితులను ఎట్టకేలకు మంగళవారం మదనపల్లె తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి డీఎస్పీ పావని మీడియాకు వివరాలు వెల్లడించారు. మదనపల్లె మండలం పోతబోలుకు చెందిన మేస్త్రి ఖాదర్‌ బాషా (54) కూలీలతో మేసీ్త్ర పనులు చేయించే వాడు. ఈ క్రమంలో ఖాదర్‌ బాషా వద్దకు కూలీ పనులు చేయడానికి సిటిఎం దళితవాడకు చెందిన పలక మురళి అతని భార్య అలాగే కొత్త కూరాకులవారిపల్లికి చెందిన పాకాల కిరణ్‌ వెళ్లే వారు. ఈ నేపథ్యంలో పలక మురళి మద్యం అలవాటు ఉండడంతో భార్య పిల్లల్ని పట్టించుకోకుండా పోయాడని, మురళి భార్య తన మేస్త్రి ఖాదర్‌ బాషాతో సన్నిహితంగా కొనసాగడాన్ని భర్త గమనించాడని డీఎస్పీ తెలిపారు. అప్పటి నుంచి మురళి అతని భార్య ఖాదర్‌ బాషా వద్దకు పనులకు వెళ్లకుండా మానేశారన్నారు. తనకు మురళి భార్య దూరం అవుతోందన్న బాధతో ఖాదర్‌బాషా.. మురళిని మట్టు పెట్టడానికి పథకం వేసుకున్నట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే గత నెల 14న రాత్రి కొత్త కూరాకులవారిపల్లెకు చెందిన పాకాల కిరణ్‌ సాయంతో పలక మురళిని సిటిఎం సమీపంలోని కంకర ఫ్యాక్టరీ వద్దకు రప్పించారన్నారు. మద్యం తాపించి బండరాళ్లతో కొట్టి హత్య చేసి, ఆపై బైక్‌లో ఉన్న పెట్రోల్‌ తీసి చనిపోయిన పలక మురళి మీద పోసి తగలబెట్టి పరారైనట్లు తెలిపారు. 15న మురళి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుపై తాలుకా సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక ఆధారాలతోపాటు హత్యకు ఉపయోగించిన బండరాళ్లు, బీరు బాటళ్లు సీజ్‌ చేసి ల్యాబ్‌కు పంపడం జరిగింది. అనంతరం నిందితుల కోసం గాలిస్తుండగా, స్థానిక ఎరగాని మిట్ట టిడ్కో ఇళ్ల వద్ద ఇద్దరిని మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని, మొబైల్‌ ఫోన్లతో సహా బైకును సీజ్‌ చేశారు. వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ అనంతరం నేరం అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్య కేసును ఛేదించిన సీఐ కళా వెంకటరమణను డీఎస్పీ అభినందించి రివార్డుకు ఎస్పీకి సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement