క్వారీకి స్థలం కేటాయింపుపై ప్రజాభిప్రాయ సేకరణ | - | Sakshi
Sakshi News home page

క్వారీకి స్థలం కేటాయింపుపై ప్రజాభిప్రాయ సేకరణ

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

కలికిరి : మండలంలోని గుండ్లూరు, పల్లవోలు గ్రామాల పరిధిలోని శ్రీలక్ష్మీస్టోన్‌ క్రస్సర్‌(క్వారీ)కి అదనపు స్థలం కేటాయింపుపై మంగళవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కడప కార్యాలయం అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పీలేరు డివిజినల్‌ రెవెన్యూ అధికారి శ్రీనివాసులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారి సుధ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో క్వారీ నిర్వహణకు గానూ గ్రామాలలో చేపట్టవలసిన కనీస సౌకర్యాలు, వసతులు కల్పించలేదని, పర్యావరణ పరిరక్షణ చర్యలు సైతం చేపట్టలేదన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా క్వారీ నిర్వహించుకోవాలని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కోరారు.

అదనపు స్థలం కేటాయింపునకు చర్యలు

మండలంలోని గుండ్లూరు, పల్లవోలు గ్రామాల పరిధిలోని ఈ క్వారీ ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో గతంలో చుట్టు పక్కల గ్రామాలైన కొత్తపల్లి, శీనప్పగారిపల్లి, పెద్ద దళితవాడ, గ్యారంపల్లి దళితవాడ, గడి తదితర ప్రాంతాంలో నివాసాలు దెబ్బతిన్నాయి. నాయకునివారిపల్లిలో నివాసాలు దెబ్బతినడంతోపాటు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ పూర్తిగా దెబ్బతిని నిరుపయోగంగా మారింది. ప్రజలు సైతం జబ్బులకు గురయ్యారు. చుట్టు పక్కల మామిడి తోటలు, పంటలు సైతం దెబ్బతింటున్నాయి. ఇప్పుడు మళ్లీ క్వారీకి అదనంగా 12 ఎకరాల విస్తీర్ణం కేటాయించడం పలు విమర్శలకు తావిస్తోంది. కార్యక్రమంలో తహసీల్దారు సయ్యద్‌, మండల సర్వేయరు రెడ్డెప్ప, మైనింగ్‌ శాఖ అధికారులు, వీఆర్‌ఓలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement