మామిడికి సంబంధించి ధరల వివరాలు
ధరలు లేవు...కాయలు లేవు...
● జిల్లాలో పతనమైన మామిడి ధరలు
● జిల్లాలో 34 వేల ఎకరాల్లో
వివిధ రకాల మామిడి సాగు
● గత ఏడాది ధర లేక
అల్లాడిపోయిన మామిడి రైతు
● ప్రసుత్తం కూడా అవే పరిస్థితులు
పునరావృతం
సాక్షి అన్నమయ్య : మామిడి రైతులకు కష్టకాలం వెంటాడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితులతో రైతు కుదేలవుతున్నాడు. వీరిని ఆదుకోవాల్సిన కూటమి సర్కార్ కూడా చూసీచూడనట్లు వ్యవహారిస్తోంది. ఽమామిడికి సంబంధించి సీజన్ మొదట్లోనే అమ్ముకుంటే ధరలు ఉంటాయని ఆశించిన రైతుకు ఆశాభంగం తప్పలేదు. చివరికి 15 రోజుల కిందట ఒక మోస్తరు ధరలు పలికినా....ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో పతనమయ్యాయి. నాటురకం కాయలను అడిగే వారు లేరంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. అంతేకాదు...కొనుగోలు చేసే వ్యాపారులు కూడా టన్ను నాటురకం కాయలను కేవలం 4–5 వేలకు అడుగుతున్నారు. గతేడాది అనుభవించిన విపత్కర పరిస్థితుల నుంచి బయటపడదామనుకున్నా ఈసారి కూడా అలాంటి పరిస్థితుల్లో ఉత్పన్నమవుతుండడంతో మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు.
పాతాళంలోకి ధరలు
అన్నమయ్య జిల్లాలో మామిడి ధరలు పూర్తిస్థాయిలో పతనమయ్యాయి. యుద్ద నేపథ్యం కావచ్చు...ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు లేకపోవడం కావచ్చు....ఇతర కారణాలేవైనా మామిడి రైతులకు మాత్రం కిష్ల పరిస్థితులు తప్పడం లేదు. ఈసారి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో దిగుబడి కూడా అంతంతమాత్రంగా ఉంది. చివరకు బేనీషా లాంటి కాయలకు కూడా మంచి ధర లభించడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.
ప్రతిసారి తప్పని తిప్పలు
రాష్ట్ర వ్యాప్తంగా మామిడి రైతులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో సుమారు 34 వేల హెక్టార్లలో పంట సాగులో ఉంది. అయితే ధరలు లేకపోవడంతో దిగుబడులు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రతిసారి అన్నదాతకు ఇలాంటి క్లిష్ట పరిస్థితులే ఎదురవుతున్నా ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు మామిడి సీజన్ ఉంటుంది. జిల్లాలోని పుంగనూరు, మదనపల్లె, పీలేరు, రాయచోటితోపాటు గతంలో అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వేకోడూరు, రాజంపేట పరిసర ప్రాంతాల్లో మామిడి మార్కెట్ విస్తారంగా ఉంది. అయితే ప్రస్తుతం ధరలు లేకపోవడంతో మార్కెట్లు కూడా కళ తప్పాయి. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండీలకు కూడా దిగుబడి లేకపోవడంతో సరుకు రాకపోవడం, ధరలు లేకపోవడంతో మండీలు ఖాళీగా కనిపిస్తుండటం గమనార్హం.
గిట్టుబాటు ధర లేక....
పధానంగా లాల్ బహార్, బేనీషా, ఖాదర్, తోతాపురి, ఇమామ్ పసంద్, చెరుకు రసం, సువర్ణ రేఖ, దసేరి, మలుగ్బా తదితర రకాలు సాగులో ఉన్నాయి. ప్రతి ఏడాది నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడం లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని మామడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గుజ్జు పరిశ్రమలకు సంబంధించి అయినా మంచి ధర నిర్ణయించి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రతిసారి మామిడి రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లేక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
మామిడి రకం 15–20 రోజుల కిందట ప్రస్తుతం
(టన్ను రూ. లలో) (టన్ను రూ.లలో)
బేనీషా 60–70 వేలు 35 వేలు
తోతాపురం 35 వేలు 10–15 వేలు
ఇమామ్ పసంద్ 1.15–1.30 లక్షలు 65–70 వేలు
లాల్ బహార్ 50 వేలు 15 వేలు
ఖాదర్ 80 వేలు 30 వేలు
చెరుకు రసం 40 వేలు 20 వేలు
సువర్ణ రేఖ 70 వేలు 35 వేలు
మగుల్బా 70–80 వేలు 50 వేలు
దసేరి 80 వేలు 35 వేలు
కేసరి లక్ష 40 వేలు
మల్లిక 90 వేలు 65 వేలు
అతి మధురం 1.20 లక్షలు 60 వేలు
నాటురకాలు 25–30 వేలు 5–6 వేలు
ప్రస్తుతం దిగుబడి లేకపోవడంతో మండీలకు కాయలు రావడం లేదు. అనేక రకాలు సాగు చేస్తున్నా కాయలు మాత్రం రావడం లేదు. ధరలు పది పదిహేను రోజుల కిందట ఓ రకంగా ఉన్నా....ప్రస్తుతం ఆశించిన మేర లేవు. దీంతో వచ్చిన కాయలనే గ్రేడింగ్ చేసి అవసరమైన ప్రాంతాలకు పంపుతున్నాం. తాము తోటల మీద తిరుగుతున్నా కాయలు లేకపోగా, ధరలు కూడా ఆశించిన మేర లేవు. – బి.మోహన్‌రెడ్డి, బీఎంఆర్ ఫ్రూట్స్ యజమాని


