● జిల్లా కేంద్రమైనా
పాత చిన్నగది కేటాయింపు
● ఆక్సిజన్ సిలిండర్ల నిల్వ నిల్
● అత్యవసరానికి వెంపర్లాడాల్సిందే
సాక్షి, మదనపల్లె: జిల్లా కేంద్రం మదనపల్లెకు 108 సేవల కష్టాలు వెంటాడుతున్నాయి. ఉండాల్సిన వసతులు, సౌకర్యాలు లేకపోగా రెండు లక్షల జనాభా కలిగిన పట్టణం, లక్షల దాకా ఉన్న రూరల్ మండలం జనాభాకు ఒకే అంబులెన్స్ సేవలందిస్తోంది. అది కూడా తిరుపతికి రెఫర్ కాకపోతేనే. ఈ పరిస్థితుల్లో 108 సేవలపై నీలి నీడలు అలముకుంటున్నాయి. ప్రభుత్వం సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఎదురుచూస్తున్నారు.
ఒక్కటే అంబులెన్స్
ఆరోగ్యశ్రీ కింద నిర్వహణలో ఉన్న 108 అంబులెన్స్ సేవలు పెరగడం లేదు. నాలుగు నెలల క్రితం వరకు డివిజన్ కేంద్రంగా ఉన్న మదనపల్లె తర్వాత జిల్లా కేంద్రమైంది. అప్పటి 108 సేవలు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. రెండు లక్షల జనాభా కలిగిన పదనపల్లె పట్టణం, లక్షన్నర జనాభా దాటిన మదనపల్లె రూరల్ మండలం కలిపి మూడున్నర లక్షల జనాభాకు ఒక అంబులెన్స్ మాత్రమే ఉంది. ఈ జనాభాకు సేవలు అందించడం అటుంచితే.. ఎప్పుడు రెఫరల్ కేసులు పడతాయో తెలియవు. కేసు వచ్చిందంటే ఇక తిరుపతికి వెళ్లి రావాలి. అంతవరకు ఇక్కడ సేవలు అందించేందుకు వీలు లేదు. ఫలితంగా అత్యవసర సేవలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉన్నది ఒక అంబులెన్స్ మాత్రమే అయినా సేవలు మాత్రం తిరుపతి వరకు అందిస్తున్నారు. ఫలితంగా ఇక్కడ అత్యవసర పరిస్థితి వస్తే ప్రైవేటు సేవలే దిక్కు.
ఆక్సిజన్ నిల్వలు లేవు
జిల్లా కేంద్రంలో 108 సేవలు అందించడం కోసం ఆక్సిజన్ సిలిండర్లను స్థానికంగా నిల్వ ఉంచాల్సి ఉంది. 100 కిలోల సామర్థ్యం కలిగిన సిలిండర్లు 20కి పైగా స్టాక్ ఉంచాలి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాలయాన్ని, గదులను కేటాయించాల్సి ఉంది. అయితే ఈ ఏర్పాటు చేయకపోవడంతో స్టాక్ పెట్టుకోవడానికి అవకాశం లేకపోయింది. ఇక్కడి నుంచి రెఫరల్ కేసుతో అంబులెన్స్ తిరుపతికి వెళితే అక్కడి ఏజెన్సీ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అందుబాటులో ఉన్న సిలిండర్ ఖాళీ అయితే అత్యవసర ఆక్సిజన్ కోసం దిక్కులు చూడాల్సిందే.
పాత చిన్న గది కేటాయింపు
రహదారి, భవనాల శాఖ అతిథి గృహాల ఆవరణలో ఓ పాడుబడిన చిన్న గదిని 108 కోసం కేటాయించారు. ఇక్కడ విధుల్లో ఉన్న అంబులెన్స్ నిలిపి ఉంచుతున్నారు. ఏదైనా సేవల కోసం సిబ్బంది ఇక్కడి నుంచే అంబులెన్స్ తీసుకెళ్తారు. ఈ చిన్న గదిలో విధుల్లో ఉన్న సిబ్బంది ఉండాల్సి వస్తోంది. చిన్న సౌకర్యం కూ డా లేని ఈ గదిలో సిబ్బంది ఇబ్బందులు పడుతు న్నారు. జిల్లా కేంద్రానికి తగ్గట్టుగా భవనం కేటాయింపు జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఎక్కడ ఉంచుతారన్న ప్రశ్న తలెత్తుతుంది.
నిర్లక్ష్యమే
108 సేవలకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శలు వస్తున్నాయి.స్థానికంగా ఆక్సిజన్ సిలిండర్లు నిలువ ఉంచుకునే ఏర్పాట్లు ఇంతవరకు చేయకపోవడం, పట్టణం, మండలానికి కలిపి ఒకే అంబులెన్స్ సేవలు కొనసాగిస్తుండటంతో మెరుగైన ఫలితాలు కనిపించడం లేదు. ప్రధానంగా జిల్లాలోని 25 మండలాలకు, 26 అంబులెన్సులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు నిలువ ఉంచుకుని చర్యలు చేపట్టాల్సి ఉంది.
ప్రతిపాదించాం
జిల్లా కేంద్రమైన మదనపల్లెకు మరో మూడు అంబులెన్సులు అవసరమని, మంజూరు చేయాలని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కు ప్రతిపాదనలు పంపించామని జిల్లా 108 మేనేజర్ సుబ్రమణ్యం చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్ల స్టాకును పీలేరులో ఉంచుతున్నట్టు చెప్పారు.


