ప్రొద్దుటూరు క్రైం : మస్క్యులర్ డిస్ట్రోఫీ.. ఇది ప్రాణాంతక వ్యాధి.. వ్యాధి సోకిన పిల్లలు నాలుగు అడుగులు కూడా వేయలేరు, సరిగా కూర్చోలేరు, మెట్లెక్కలేరు.చచ్చు బడుతున్న శరీరంతో నరకయాతన అనుభవిస్తుంటారు ఈ వ్యాధిగ్రస్తులు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యం కాకున్నా వస్తుంటుంది. ప్రతి 3 వేల మంది మగపిల్లల్లో ఈ వ్యాధి ఒకరికి సోకుతుంది. వ్యాధి కారణంగా కండరాల బలహీనత ఏర్పడుతుంది. సాధారణంగా అయితే నాలుగేళ్ల వయసులో మొదలై ఊహించినంత శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వారు తీవ్రమైన కండరాల క్షీణతకు గురవుతారు. నడవలేక పోవడం, కూర్చోలేక మంచానికే పరిమితమవుతారు. వయసు పెరిగేకొద్దీ శ్వాసకోశ వ్యాధులు కూడా చిన్నారులను వేధిస్తాయి. కడప జిల్లాలో ఈ వ్యాధితో బాధపడే చిన్నారులు 30 మందికి పైగా ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. గతంలో ఈ వ్యాధికి మందు లేదు. అయితే ఇటీవల ఈ కండరాల క్షీణత వ్యాధికి అమెరికాలో ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నట్లు కొందరు వైద్యులు చెబుతున్నారు. అయితే ఆ ఇంజెక్షన్ ఖరీదు రూ. 25 కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు. అంత పెద్ద మొత్తం వెచ్చించి ఇంజెక్షన్ వేయించడం అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధిన పడిన చిన్నారుల కుటుంబాలను ఆదుకొని వారికి వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
జిల్లాలో 30కి పైగా డీఎండీ బాధితులు
ప్రొద్దుటూరు పరిసర ప్రాంతంలో 10 మందికి పైగా డీఎండీ బారిన పడిన చిన్నారులు ఉన్నారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, పోట్లదుర్తి, అల్లాడుపల్లెతో పాటు జిల్లా వ్యాప్తంగా 30 మంది చిన్నారులు డీఎండీ వ్యాధి బారిన పడినట్లు వైద్యులు చెబుతున్నారు. పలువురు డీఎండీ బాధిత చిన్నారులు జిల్లా ఆస్పత్రి, కడప రిమ్స్‌లో కేంద్రంలో వైద్యసేవలు, పిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఇది అందరికి తెలిసిన వ్యాధి కాదని, దీనిపై అవగాహన అవసరమని వైద్యులు చెబుతున్నారు. నడవడంలో ఇబ్బంది పడటం, తరచూ పడిపోవడం, కాళ్లు, చేతుల్లో కండరాల బలహీనత, 10 ఏళ్లకే నడక కోల్పోవడం, శ్వాసతీసుకోవడంలో, గుండె పనితీరులో సమస్యలు తదితర ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా భావించాలన్నారు. కండరాల క్షీణత వ్యాధికి ప్రస్తుతం ఖచ్చితమైన నివారణ లేనప్పటికీ చికత్సతో వ్యాధి పురోగతిని తగ్గించవచ్చన్నారు. ఫిజియోథెరపీ, గుండె, శ్వాసకోశ చికిత్సలు కండరాల పనితీరును కాపాడటానికి సహాయపడతాయని తెలిపారు.
చిన్నారుల ప్రాణాలను హరిస్తున్న
మస్క్యులర్ డిస్ట్రోఫీ
ప్రొద్దుటూరులో ఒకే ఇంట్లో ఇద్దరికి కండరాల క్షీణత వ్యాధి
జిల్లాలో 30 మందికి పైగా వ్యాధి గ్రస్తులు
పిల్లలు పుట్టగానే వారి బోసినోటి నవ్వులు, బుడిబుడి నడకలను చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోతారు.
వారి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్ది ఉన్నతవంతులుగా చూడాలని పరితపిస్తుంటారు. అయితే వారి ఆశలను డీఎండీ వ్యాధి చిదిమేస్తోంది. ఆడుతూ పాడుతూ బాల్యాన్ని గడపాల్సిన ఈ చిన్నారులు ఇక ఎప్పటికీ అడుగులు వేయలేరని తెలిస్తే ఆ తల్లిదండ్రుల గుండె
తట్టుకోగలదా.. డుచ్చెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన కండరాల క్షీణత వ్యాధి చిన్నారుల ప్రాణాలను హరిస్తోంది.


