మదనపల్లె టౌన్ : భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం తంబళ్లపల్లె మండలంలో చోటుచేసుకున్న ఘటనపై బాధితుడి కుటుంబీకులు, జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. అన్నమయ్య జిల్లా, చిన్నమండెంకు చెందిన పెద్ద రెడ్డప్ప భార్య నాగవేణి అలిగి వారం రోజుల క్రితం పుట్టినిల్లు అయిన తంబళ్లపల్లె మండలంలోని కోటకొండకు పిల్లల్ని కూడా వదిలేసి వచ్చేసింది. పిల్లల్ని వెంట బెట్టుకుని ఆదివారం అత్తగారి ఇంటికి వచ్చిన పెద్ద రెడ్డప్ప తన భార్యను కాపురానికి రావాలని అభ్యర్థించాడు. ఆమె రానని తెగేసి చెప్పడంతో మనస్థాపం చెంది అత్తగారి ఇంటిలోనే విషద్రావణం తాగాడు. పెద్ద రెడ్డప్పను తన ఇద్దరు పిల్లలు 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పెద్ద రెడ్డప్ప వెంట చిన్నపిల్లలు ఉండడంతో జిల్లా ఆస్పత్రిలోనే ఉంచి, వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. అవుట్ పోస్టు పోలీసుల సమాచారంతో తంబళ్లపల్లె పోలీసులు కేసు విచారిస్తున్నారు.


