● ప్రాణం తీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

● ప్రాణం తీసిన ఈత సరదా

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

అట్లూరు : సరదా కోసం ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన అట్లూరులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. అట్లూరు మండలం తంబళ్లగొంది గ్రామానికి చెందిన చిల్లు కొండమ్మ, నరసింహులు కుమారుడు పవన్‌ కుమార్‌ (16) ఆదివారం తోటి స్నేహితులతో కలిసి అట్లూరు గ్రామ పొలాల్లో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు పవన్‌కుమార్‌ నీట మునిగిపోవడంతో తోటి పిల్లలు స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ఎస్‌ఐ నాగకీర్తన సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో బద్వేలు నుంచి అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. ఎట్టకేలకు సాయంత్రం 7 గంటలకు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షల్లో 450 మార్కులు సాధించినట్లు విద్యార్థి బంధువులు తెలిపారు.

సింహాద్రిపురం : ఈత సరదా ఒకరి ప్రాణం తీసింది. ఆదివారం జరిగిన సంఘటన సంబంధించిన వివరాలు.. దిద్దికుంట గ్రామంలో ఆదివారం దేవర కార్యక్రమం తలబెట్టారు గ్రామంలో బంధువులు ఇంటికి శనివారం తాడిపత్రికి చెందిన వల్లెపు హరి(19) వచ్చాడు. ఇతను డిప్లమో చేస్తున్నాడు. ఆదివారం సరదాగా తోటి స్నేహితులతో సంపు వద్దకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు సంపులో జారి పడటంతో స్నేహితులు రక్షించలేని పరిస్థితుల్లో కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయాడు. అయితే జరిగిన విషయం గ్రామంలో తెలపడంతో పైర్‌ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని వెలుపలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేయాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement