కలికిరి : గుండెపోటుకు గురై హైదరాబాద్ వాసి మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం కలికిరిలో చోటు చేసుకుంది. వివరాలు.. హైదరాబాద్ నగరం ప్రగతి నగర్‌కు చెందిన కనుకుంట్ల రాజేందర్(60) కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన ఆర్.శ్రీనివాసులు రెడ్డికి స్నేహితుడు. రాజేందర్ హైదరాబాద్‌లో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ... బెంగళూరు, చింతామణి, మదనపలె ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం హైదరాబాదు నుంచి బెంగళూరు, చింతామణికి వచ్చి కలికిరికి వచ్చాడు. రెండురోజుల తర్వాత శ్రీనివాసులు రెడ్డి సొంత పనుల నిమిత్తం హైదరాబాదు వెళ్లాడు. రాజేందర్ మిత్రుడి రూములో ఉన్నాడు. ఆదివారం ఉదయం శ్రీనివాసులు రెడ్డికి ఫోన్ చేసి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పాడు. దీంతో అతని సూచన మేరకు స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. స్టేట్‌బ్యాంక్ సమీపంలో టిఫిన్ చేసి రోడ్డుపైకి వచ్చి గుండె పోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు మృతుని సెల్‌ఫోన్ ఆధారంగా శ్రీనివాసులురెడ్డికి సమాచారమిచ్చారు. స్నేహితుని ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతుడు కనుకుంట్ల రాజేందర్ ప్రముఖ సినీ రచయిత చంద్రబోస్‌కు స్వయాన సోదరుడు. మృతుని భార్య వసంత కూడా తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా మృతుడు మరో రెండు నెలల్లో పదవీ విరమణ పొందనున్నట్లు సమాచారం. ఎక్కడినుంచో వచ్చి హఠాన్మరణం చెందడం స్థానికులను కలచివేసింది.


