మదనపల్లె సిటీ: శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఆపద మొక్కులవాడా గోవిందా...అనాధరక్షక గోవిందా...అంటూ స్వామి నామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు లాగుతూ భక్తజనం పరవశించారు. మదనపల్లె పట్టణం దేవళంవీధిలోని శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 10.35 గంటలకు బ్రహ్మ రథోత్సవం కన్నుల పండవగా సాగింది. రథాన్ని పుష్పాలతో అలంకరించి ఉత్సవ మూర్తులను రథంపై ఆశీనులను చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నవీన్, ఈఓ రమణ టెంకాయ కొట్టి రథాన్ని ముందుకు లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు గోవింద స్మరణలతో రథంను ముందుకు లాగుతూ సాగారు. ఆధ్మాతిక వాతావరణంతో కొనసాగింది. రథం ముందు కొలాటాలు, భజన గీతాలు, ప్రత్యేక వాయిద్యాలు అలరింపజేశాయి. సాయంత్రం హోమం,ప్రాకారోత్సవం చేశారు.


