మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో ఆకతాయిలపై నిఘా ముమ్మరం చేసి, వారి ఆట కట్టించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నిఘా వ్యవస్థను సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ విజిబుల్ పోలీసింగ్‌ను ముమ్మరం చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్ ) వెంకటాద్రి తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను జోడించిందన్నారు. మదనపల్లి, రాయచోటి పట్టణాలలోని రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. నేల మీద పోలీసులు గస్తీ తిరుగుతుంటే, ఆకాశం నుంచి డ్రోన్ కెమెరాలు ప్రతి కదలికను రికార్డు చేస్తున్నాయన్నారు. దీంతో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బందిని అప్రమత్తం చేసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం శక్తి బృందాలు క్షేత్ర స్థాయిలో చురుగ్గా పని చేస్తున్నాయన్నారు. కాలేజీలు, బస్టాండ్లతోపాటు రద్దీగా ఉండే వ్యాపార సముదాయాల వద్ద నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఆకతాయిలు ఆడ పిల్లలు, మహిళల్ని వేధింపులకు పాల్పడుతుంటే డ్రోన్ విజువల్స్ ఆధారంగా వారిని వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే డ్రోన్ నిఘా ద్వారా తప్పించుకోవడం అసాధ్యమన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100/112 లేదా స్థానిక పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు.


