కోర్టులో అనుచిత ప్రవర్తనపై రేంజర్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

కోర్టులో అనుచిత ప్రవర్తనపై రేంజర్‌ సస్పెన్షన్‌

May 2 2026 7:44 AM | Updated on May 2 2026 7:44 AM

పుంగనూరు : ఓ క్వారీ లైసెన్సు, భూముల కేటాయింపు విషయంలో హైకోర్టుకు 18 పేజీల నివేదికలను తారుమారు చేసి, మార్చి 3న హైకోర్టులో నేరుగా హాజరై అనుచితంగా, క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించిన పుంగనూరు ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీరాములును సస్పెండ్‌ చేస్తూ అటవీశాఖ ప్రిన్సిపల్‌ కన్సర్‌వేటర్‌ డాక్టర్‌ పీవీ చలపతిరావు ఉత్తర్వులు జారీ చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలం పాలెంపల్లెకి చెందిన ఓ క్వారీ యజమాని లైసెన్సు, క్వారీ భూముల ఆక్రమణతో క్వారీ నిర్వహణలపై రాష్ట్ర హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి అటవీశాఖ కౌంటర్‌ దాఖలు చేసింది. 3 నుంచి 18 పేజీల నివేదికలు తారుమారు చేసి కోర్టును తప్పుదోవ పట్టించే వారని, దీనివల్ల అటవీశాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హైకోర్టు విచారణలో వెల్లడైంది. దీనిపై హైకోర్టు మార్చి 3వ తేదీన అటవీశాఖ అధికారులు హైకోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పుంగనూరు రేంజర్‌ శ్రీరాములు కూడా మార్చి 3న హైకోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా రేంజర్‌ క్రమశిక్షణా రహితంగా న్యాయమూర్తి ఎదుట ప్రవర్తించడం, అహంకార పూరితంగా మాట్లాడటం, తప్పుడు నివేదికలు కోర్టుకు సమర్పించడంతోపాటు అదే నివేదికలను రెండు సార్లు మార్చి సమర్పించడంపై హైకోర్టు ఫారెస్ట్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి రేంజర్‌ అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ చర్యలపై బీఎఫ్‌వో నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఈ నివేదికలను పరిశీలించిన ప్రభుత్వం రేంజర్‌ శ్రీరాములును సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే సస్పెన్షన్‌ కాలంలో శ్రీరాములు అనుమతి లేకుండా పుంగనూరు వదిలి వెళ్లరాదని ఆదేశించారు. పుంగనూరు ఎఫ్‌ఆర్‌వోగా ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement