కురబలకోట: కురబలకోట మండలంలోని కడప క్రాస్, దిగువబోయపల్లి పరిసర గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన వర్షానికి టమాటా, వరి పంటలు దెబ్బతిన్నాయి. 45 నిమిషాల పాటు పడిన వడగళ్ల వానకు ఇటీవల కొత్తగా నాటిన టమాటా దెబ్బతింది. కడప క్రాస్ కు చెందిన ఏవీ లక్ష్మిదేవమ్మకు చెందిన మూడు ఎకరాల టమాటా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇంకా నేలను పట్టుకుని నిలబడక ముందే వడగళ్ల దెబ్బకు విరిగిపోయి తలవంచినట్లుగా మారా యని తెలిపారు. పరిసర ప్రాంతాల్లో 70 ఎకరాలకు పైగా పంటకు నష్టం సంభవించినట్లు రైతులు వాపోయారు. వడగళ్ల వాన కడగండ్లను మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
చెట్లు పడి కూలిన కరెంటు స్తంభాలు
మండలంలోని వివిధ ప్రాంతాల్లో 70 ఎకరాలకు పైగా పంటకు నష్టం సంభవించినట్లు బాధిత రైతులు చెబుతున్నారు. మరో వైపు విద్యుత్ శాఖకు కూడా నష్టం వాటిల్లింది. కుక్కరాజు పల్లి క్రాస్ వద్ద పెద్ద చెట్టు విరగడంతో 33 కేవీ లైన్ దెబ్బతింది. కడప క్రాస్, పిచ్చలవాండ్లపల్లి తదితర ప్రాంతాల్లో ఏడు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణకు శరవేగంగా చర్యలు చేపట్టినట్లు ట్రాన్స్‌కో ఏఈ తెలిపారు.
హార్సిలీహిల్స్‌పై అంధకారం
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై బుధవారం రాత్రి అంధకారం నెలకొంది. సాయంత్రం గాలి వాన కారణంగా విద్యుత్ సరఫరా తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో సాయంత్రం ఐదు నుంచి రాత్రంతా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. కొండంత చీకటితో నిండిపోయింది. ఇక్కడ విడిది చేసిన పర్యాటకులు గదులకే పరిమితమయ్యారు. ఘాట్ రోడ్డులో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఏఈ మాట్లాడుతూ గాలి కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
బోయపల్లి దగ్గర విద్యుత్‌లైన్‌పై విరిగి పడిన చెట్టును తొలగిస్తున్న సిబ్బంది
కడప క్రాస్‌లో వర్షానికి పడ్డ వడగళ్లు
రైతుల కష్టం నిమిషాల్లో నేల మట్టం
దెబ్బతిన్న టమాటా, వరి పంటలు


