మదనపల్లె: టమోటా ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం మదనపల్లి మార్కె ట్లో మొదటి రకం రూ.30 పలికింది. రెండో రకం కిలో రూ.24 పలికింది. కాగా బుధవారం మార్కెట్‌కు 305 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. టమాట దిగుబడులు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రభావం ధరలపై కనిపిస్తోంది. ఆదివారం 256 టన్నులు, సోమవారం 250 టన్నులు, మంగళవారం 292 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది.
మదనపల్లె: జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో మదనపల్లెలో మే ఒకటి నుంచి ఎల్.జీ. గిరి రావు స్మారక ఉచిత హాకీ శిక్షణా శిబిరాన్ని బిటి కళాశాల హాకీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్, జిల్లా హాకీ సంఘ అధ్యక్షుడు పి.వి.ప్రసాద్ బుధవారం తెలిపారు. మే ఒకటి నుంచి 31 వరకు జరిగే ఈ శిక్షణకు మదనపల్లి, పరిసర ప్రాంతాల విద్యార్థిని, విద్యార్థులు శిక్షణలో పాల్గొని హాకీ క్రీడలో నైపుణ్యం పెంచుకోవాలని కోరా రు. ఈ శిక్షణ శిబిరంలో వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: కడప–విశాఖపట్టణం–కడప మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు వరకు పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. మే 12 నుంచి గుంతకల్లు–విశాఖపట్టణం (18522), మే 13వ తేది నుంచి విశాఖపట్టణం–గుంతకల్లు (18521) తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నారని తెలిపారు. విశాఖపట్టణంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2.00 గంటలకు బయలుదేరి మరుసటిరోజు కడపకు ఉదయం 7.03 గంటలకు చేరుకుని ఎర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి మీదుగా గుంతకల్లుకు 11.30 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి గుంతకల్లులో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి కడపకు సాయంత్రం 5.40 గంటలకు చేరుకుని మరుసటిరోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్టణానికి చేరుతుందని ఆయన వివరించారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపోలో పనిచేసేందుకు ఆన్‌కాల్ డ్రైవర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కడప డిపో మేనేజర్ నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30వ తేది డీఎం కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. 21 సంవత్సరాలు దాటి హెవీ లైసెన్స్ పొంది 18 నెలలు పూర్తయిన వారు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. ఇతర వివరాలకు తమ కార్యాలయంలోగానీ, 73828 60968 నెంబరులో సంప్రదించాలని వివరించారు.
పులివెందుల రూరల్: ఏపీ కార్ల్ సీఈఓగా పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దామోదర్ నాయుడును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పశుసంవర్థక రంగంలో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తానన్నారు.
ప్రొద్దుటూరు రూరల్: మండలంలోని దొరసానిపల్లె గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్న జింకా అంజనీకుమార్ ఆర్‌ఎంపీ క్లినిక్‌ను బుధవారం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్‌ఎంపీలు వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు మాత్రమే సేవలు అందించాలన్నారు. అంతకంటే ఎక్కువ వైద్యం అందించి రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ బీఏ వరప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.


