కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్
మదనపల్లె టౌన్: జిల్లా వ్యాప్తంగా రౌడీ మూకలను అణచివేయాలని కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి, డీఎస్పీ పావనితో కలిసి జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై డేగకన్ను వేయాలని, అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై స్పందిస్తూ.. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, బ్లాక్ స్పాట్‌లను గుర్తించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ బి.పావని తో పాటు పలువురు సీఐలు, పాల్గొన్నారు.


