వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యాభాస్యం పూర్తి చేసి న విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని బుధవారం రాత్రి ట్రిపుల్‌ఐటీ అకాడమిక్ బ్లాక్–1 వద్ద ధర్నా చేపట్టారు. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమకు రావాల్సిన స్కాలర్‌షిప్ బకాయిల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా స్కాలర్‌షిప్ నిధులు విడుదల కాకపోవడంతో ఫీజుల చెల్లింపులు ఆగిపోయాయని, దీనివల్ల సర్టిఫికెట్లు పొందే విషయంలో, ఉన్నత చదువుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని డెరెక్టర్ కార్యాలయం వద్ద వారు బైఠాయించారు. ప్రభుత్వం స్పందించి తమ స్కాలర్‌షిప్ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.


