మదనపల్లె టౌన్: నిమ్మనపల్లెలో ఫారెస్ట్ అధికారి కారు ఢీకొని ఒకే కుటుంబంలోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం సాయంత్రం జరిగిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లి మండలం, గార బురుజు వద్ద రాచవీటి వారి పల్లి కు చెందిన భాస్కర్ (45), సుజాత (40), భారతి (25) రోడ్డు పక్కన ఆటో కోసం వేచి ఉండగా, అటవీ శాఖ అని రాసి ఉన్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని స్థానికులు చికిత్స కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నారు. కాగా ప్రమాదానికి కారణమైన ఫారెస్ట్ అధికారి ఎవరనేది ఇంకా తెలియ రాలేదు. పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
చేనేత కార్మికుడిపై కత్తితో దాడి
మదనపల్లె టౌన్: ఉత్తరప్రదేశ్ (యూపీ)కు చెందిన చేనేత కార్మికుడిపై యూపీకి చెందిన మరో చేనేత కార్మికుడు కత్తితో దాడి చేశాడు. బుధవారం రాత్రి మదనపల్లెలో జరిగిన ఘటనపై బాధితుడు తెలిపిన వివరాలు. యూపీ రాష్ట్రం కోట్వర్, వారణాసికి చెందిన ఇబ్రహీం కొడుకు మహమ్మద్ ఖాసీమ్ (32) మదనపల్లెకు వచ్చి నీరుగట్టువారిపల్లెలో మగ్గాలు నేస్తున్నాడు. ఈ క్రమంలో యూపీ కోట్వర్ కు చెందిన మరో చేనేత కార్మికుడు కూడా నీరుగట్టుపల్లి, రామిరెడ్డి లే ఔట్ లోనే మగ్గాలు నేస్తున్నాడు. ఇద్దరూ కలసి మద్యం తాగేందుకు గాలిమిషన్ వద్ద ఉన్న మద్యం షాపుకు వచ్చారు. తాగి ఇంటికి వెళుతూ గొడవపడ్డారు. మాటమాటా పెరిగి హబీబ్ తన వద్ద ఉన్న కత్తితో మహమ్మద్ ఖాసీమ్ను పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒకటో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
బైక్ అదుపుతప్పి కిందపడి..
మదనపల్లె టౌన్: ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైకు అదుపుతప్పి కిందపడటంతో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగిన ఘటనపై బాధితుని కుటుంబీకుల కథనం.. బొమ్మన చెరువు పంచాయితీ, దండువారిపల్లి కు చెందిన రైతు గంగరాజు 48, సొంత పని మీద బైక్‌లో మదనపల్లెకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా కోట వారిపల్లి క్రాసు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైకు అదుపుతప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని డప్పు కళాకారులకు..
మదనపల్లె టౌన్: కారు ఢీకొని డప్పు కళాకారులు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం సాయంత్రం గుర్రంకొండ మండలంలో జరిగింది. ఎస్‌ఐ రవీంద్ర కథనం మేరకు.. మండలంలోని మర్రిపాడు పంచాయతీ, భూమకం వారి పల్లికు చెందిన నరసింహులు (60), తరిగొండ రెడ్డి వారి పల్లి కు చెందిన లక్ష్మన్న (63) గుర్రంకొండ మండలంలోని నడిమి చర్ల గ్రామం, ప్యారంపల్లిలో ఓ వ్యక్తి చనిపోతే అంత్యక్రియల్లో డప్పు వాయించడానికి వెళ్లారు. అంత్యక్రియల అనంతరం రోడ్డు పైకి వచ్చి నీటి తొట్టి వద్ద కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటుండగా ఓ కారు వేగంగా వచ్చి, వీరిని కొట్టి వెళ్ళిపోయింది. స్థానికులు గమనించి తీవ్రంగా గాయపడిన నరసింహులు, లక్ష్మన్నలను చికిత్సల నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి, నరసింహులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుర్రంకొండ ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు.
గాయపడిన నరసింహులు, లక్ష్మన్న


