పీలేరు రూరల్ : రైలు కింద పడి మహిళ మృతి చెందిన సంఘటన పీలేరు టౌన్ చిత్తూరు రోడ్డు మార్గం రైల్వేగేటు సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. స్థానిక చెన్నారెడ్డి కాలనీకి చెందిన గుండ్లూరు మనోహరమ్మ (65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ధర్మవరం వెళ్తున్న నర్సాపురం ఎక్స్‌ప్రెస్ కిందపడి మృతి చెందింది. పీలేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఢీకొన్న కార్లు..
తప్పిన ప్రమాదం
మదనపల్లె : మదనపల్లెలో మంగళవారం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఓ ప్రమాదం తప్పింది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తిరుపతిరోడ్డు నుంచి పట్టణంలోకి వచ్చేందుకు సిటిఎం రోడ్డులో వస్తుండగా విద్యుత్ కేంద్రం వద్ద కాన్వాయ్‌లోని వాహనాలకు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి వస్తున్న ఫార్చ్యూనర్ కారు ఢీకొంది. ఇదే కారుకు వెనుక వస్తున్న నాయకులు శివారెడ్డి, పద్మజారెడ్డి కార్లు ఢీకొన్నాయి. దాంతో మూడు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొని ముందు, వెనుక భాగాలు దెబ్బతిన్నాయి. అయితే వాటిలో ప్రయాణిస్తున్న నాయకులు ఎవరికీ ప్రమాదం జరగలేదు.
ఫ్యాప్టో చైర్మన్‌గా
నర్రెడ్డి సంగమేశ్వర్‌రెడ్డి
కడప ఎడ్యుకేషన్ : కడప జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) చైర్మన్‌గా నర్రెడ్డి సంగమేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. కడప వి.వి.ఆర్ ఎస్టీయూ భవన్‌లో జరిగిన ఫ్యాప్టో సభ్య సంఘాల కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఫ్యాప్టో చైర్మన్‌గా ఉన్న ఇలియాస్ బాషా ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక కావడంతో ప్రస్తుత ఎస్టీయూ కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సంగమేశ్వరరెడ్డిని ఫ్యాప్టో చైర్మన్‌గా నియమించారు. ఈ సందర్భంగా సంగమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థికపరమైన, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ఉద్యమాలే శరణ్యమని అన్నారు. గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి లబ్ధి పొంది నేడు ఇచ్చిన హామీలు మరిచి వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా 12వ పీఆర్సిపై అతీగతీ లేదని అన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో భవిష్యత్తు ఉమ్మడి ఉద్యమాలకు అందరనీ కలుపుకొని సమన్వయంతో ముందుకెళ్తామన్నారు.


