● స్వాస్థ ఆస్పత్రి ఆధ్వర్యంలో సీపీఆర్‌పై
అవగాహన
● పల్స్ బ్రోచర్స్ ఆవిష్కరించిన ముంతాజ్ అలీ
మదనపల్లె రూరల్ : ప్రజలు ప్రథమచికిత్సపై అవగాహన పెంచుకోవాలని, అత్యవసర సమయాల్లో చొరవ చూపి ప్రాణాలను రక్షించడం ద్వారా ప్రాణదాతలుగా మారవచ్చని సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ శ్రీ ఎం (ముంతాజ్‌అలీ) అన్నారు. అత్యవసర సమయాల్లో అందించాల్సిన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు స్వాస్థ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్స్‌ను ముంతాజ్‌ఆలీ చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం ముంతాజ్‌ఆలీ మాట్లాడుతూ...మానవత్వానికి కులం, మతం లేదన్నారు. అత్యవసర సమయంలో ఎవరైతే స్పందించి ఎదుటివారి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వస్తారో వారు భగవంతుడితో సమానమన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో చికిత్స అందక చాలామంది చనిపోతుంటారన్నారు. అత్యవసర సమయంలో వైద్యుల వద్దకు వెళ్లేలోపు, కీలకమైన మొదటి గంట గోల్డెన్ అవర్‌లో బాధితుడికి అందించే సహాయం అమూల్యమైనదన్నారు. ఈ సమయంలో సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చన్నారు. స్వాస్థ ఆస్పత్రి ఆధ్వర్యంలో అత్యవసర సమయాల్లో స్పందించేందుకు సాధారణ ప్రజలు నేర్చుకోగల నైపుణ్యాలను నేర్పేందుకు ప్రత్యేకంగా పల్స్ కార్యక్రమం రూపొందించామన్నారు. ఇందులో భాగంగా 8వతరగతి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకునేలా అత్యవసర సమయాల్లో ప్రదర్శించాల్సిన నైపుణ్యాలను పల్స్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పిస్తామన్నారు. గుండెపోటు, ప్రమాదాలు, బ్రెయిన్ డ్యామేజీ తదితర ఘటనల్లో వైద్యుల వద్దకు తీసుకెళ్లి చికిత్సలు అందించేందుకు ముందుగా చేయాల్సిన చికిత్సా విధానాలు(సీపీఆర్) శిక్షణ రూపంలో తెలియజేస్తామన్నారు. వీటిని నేర్చుకోవడం వల్ల అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో స్వాస్థ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్.వెంకటరమణ, డాక్టర్.శోభ వెంకట్, డాక్టర్.మంజునాథ్ శర్మ, పల్స్ కో ఆర్డినేటర్ పద్మా నాయుడు, ఆర్‌ఎంఓ డాక్టర్.ఆదర్శ్, ఫీల్డ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పవన్ తదితరులు పాల్గొన్నారు.


