చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు.రూ: 35.56లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు.బంగారం 10గ్రాములు , వెండి 136 గ్రాములు వచ్చిందన్నారు. అలాగే ఆలయం వద్ద ఉచిత అన్నదాన పథకం నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక హుండీ ద్వారా రూ:12,444 సమకూరినట్లు చెప్పారు. ఈ ఆదాయం 31 రోజులకు వచ్చినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ శశికుమార్, బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఉప్పరపల్లె టీచర్
విధుల నుంచి తొలగింపు
మదనపల్లె సిటీ: వీరబల్లి మండలం ఉప్పరపల్లె ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్‌జీటీగా పని చేసే పి.జగన్‌మోహన్‌రెడ్డిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈఓ డాక్టర్ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. 2022 జులై నుంచి ఎటువంటి సమాచారం కానీ, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు తెలిపారు. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి ద్వారా నోటీసు పంపారన్నారు. నోటీసుకు ఎలాంటి సంజాయిషీ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపలేదన్నారు. ముందస్తు అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హజరుకావడంపై ఎపీసీసీఏ రూల్స్ 199 నిబంధనల మేరకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.
భూవివాదంలో ఘర్షణ
– తల్లి, కుమారుడిపై దాడి:తీవ్రగాయాలు
మదనపల్లెటౌన్: భూ వివాదం రెండువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. గురువారం పెద్దమండ్యం మండలంలో చోటు చేసుకున్న ఘటనపై వివరాలు.. మండలంలోని శివపురం పంచాయతీ, కనకంటివారిపల్లెకు చెందిన రైతు కొంకల చంద్రశేఖర్ రెడ్డి(45) తన వ్యవసాయ భూమిని సర్వే చేయించడానికి ఇటీవల పెద్దమండ్యం తహసీల్దార్ కార్యాలయంలో చలానా కట్టాడు. దీంతో సర్వేయర్ చంద్రశేఖర్ రెడ్డి భూమిని సర్వే చేయడానికి గురువారం పొలం వద్దకు వస్తామని చెప్పడంతో వారు పొలంలో ఉన్న ముల్లపొదలు, టమాటా చెట్లకు ఉపయోగించే కట్టెలను పక్కకు జరిపే పనిలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు పాపిరెడ్డి, మల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డిలు కర్రలు, రాడ్లను తీసుకొచ్చి మూకుమ్మడిగా రైతు చంద్రశేఖర్ రెడ్డిపై దాడిచేసి కొట్టినట్లు ఆరోపించారు. కుమారుడిని పాపిరెడ్డి వర్గీయులు కొడుతుండగా వెళ్లి అడ్డుకున్న సీతమ్మ పైనా దాడి చేయడంతో తల్లి, కుమారుడు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పెద్దమండ్యం పోలీసులు విచారణ చేపట్టారు.


