వంగ రైతుకు ధరల బెంగ | - | Sakshi
Sakshi News home page

వంగ రైతుకు ధరల బెంగ

Mar 26 2026 7:41 AM | Updated on Mar 26 2026 7:41 AM

మార్కెట్లో కిలో రూ.5

వంగసాగుతో నష్టాలబాటలో రైతులు తోటల్లో కోయకుండా వదిలేస్తున్న వైనం

గుర్రంకొండ : జిల్లాలో వంగసాగు చేసిన రైతులు నట్టేట మునిగారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ. 5 వరకు ధరలు పలుకుతున్నాయి. కోతకూలీలు, రవాణా ఖర్చులు కూడా మిగలకపోవడంతో రైతులు వంగ కాయలు కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమిళనాడు,కర్ణాటకా రాష్ట్రాలకు వెళుతున్న వంగకు ధరలు లేక పోవడంతో అక్కడి వ్యాపారులు కొనుగోలుకు మొగ్గుచూపడం లేదు. దీంతో జిల్లాలో 850 ఎకరాల్లో వంగసాగు చేసిన రైతులకు రూ.12.75 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది.

జిల్లాలో 850 ఎకరాల్లో వంగసాగు

జిల్లాలో ఈ సీజన్‌లో 850 ఎకరాల్లో వంగ సాగు చేపట్టారు. ఎకరం సాగుకు దుక్కుల దగ్గర నుంచి కాయలు కోతకు వచ్చే వరకు రూ. 1.25 లక్షలనుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. చెట్టు ఎదుగుదలకు, పూతపిందె నిలవడానికి వారానికి ఒక సారి మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది. చెట్టుకు సత్తువ ఇచ్చి కాయలు ఎక్కువ కాయడానికి పురుగుల మందు కోసం ప్రతి వారం సుమారు రూ. 8వేల నుంచి రూ.10వేలవరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొక్కలు నాటిన 90 రోజులకు కాయలు కాయడం మొదలవుతుంది. సుమారు మూడు నెలల పాటు కాయల కోత ఉంటుంది.

గిట్టుబాటు ధర ఏది?

ఎకరం సాగుకు 10 టన్నుల నుంచి 12 టన్నుల వరకు వంగ దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ:5 లోపే వూత్రమే ధర పలుకుతోంది. రైతులు 60 కేజీల బస్తాల్లో మార్కెట్లకు తరలిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో బస్తా ధర రూ.300 వరకు మాత్రమే ధరలు పలుకుతున్నాయి. ఇందులో కోతకూలీలు, మార్కెట్‌కు తరలించడానికి అయ్యే రవాణాఖర్చు, మార్కెట్లో మండీల యజమానులు తీసుకొనే కమీషన్‌ లెక్కిస్తే పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలో వంకాయలు మార్కెట్‌ తరలించడానికి రవాణాఖర్చు రూ.1.50పైసలు, కమీషన్‌ రూ.1, కోత, ఇతర కూలీలు రూ.3 మొత్తం రూ.5.50 ఖర్చు వస్తుంది. ప్రస్తుతం కిలో ధర రూ.5తో పోల్చితే మార్కెట్‌కు తరలించే రైతుకు చేతి నుంచి అదనంగా ఖర్చు వస్తుంది. ఇప్పటికే ఓవైపు టమాటా, మరోవైపు పూల తోటల సాగుతో భారీగా రైతులు నష్టపోయారు. కనీసం వంగపంట అయినా తమకు గట్టెక్కిస్తుందన్న ఆశ ఉన్న రైతుల ఆశలు అడయాసలయ్యాయి. నెలరోజుల ముందు వరకు ఆశించిన మేరకు వంగ ధరలు ఉన్నాయి. అయితే రోజురోజుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వంగ ధరలు పూర్తిగా పతనమవడంతో ఆ ప్రభావం జిల్లా రైతులపై పడింది. మన జిల్లా నుంచి 90 శాతం వంగ పంట తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పూర్తిగా పక్కరాష్ట్రాలపై మన జిల్లా రైతులు ఆధారపడి వంగ పంటను సాగు చేస్తుంటారు. అక్కడ స్థానికంగా దిగుబడులు మార్కెట్లో పెరుగుతున్న కారణంగా ఇక్కడి పంటకు ధరలు లేక పోవడం గమనార్హం. అక్కడ వంకాయలన్ని కొనేవారు లేక వదిలేసి వస్తున్నారు. గత నెలరోజులుగా వంగధరలు పతనమవడంతో నష్టాలు భరించలేక కాయలను కోయకుండా రైతులు తోటల్లోనే వదిలేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో వంగతోటల్ని రైతులు దున్నేస్తున్నారు. ఇందులో కోతలు ఇంకా మొదలవని తోటలు ఉండడం దారుణం. ప్రస్తుతం ఉన్న పంటను కాపాడుకోవాలంటే ఎరువులు, పురుగుల మందులకు వేలాది రుపాయలు ఖరు చేయాల్సి ఉంటుంది. పోనీ భవిష్యత్తులోనైనా వంగ ధరలు పెరుగుతాయనే నమ్మకం లేకపోవడంతో చేసేదిలేక తోటలను దున్నేసి ప్రత్యామ్నాయ పంట సాగుల కోసం పొలాలను సిద్ధం చేసుకొంటున్నారు.

జిల్లాలో రూ.12.75 కోట్ల మేరకు నష్టం

ఈ సీజన్‌లో జిల్లాలో వంగ పంట సాగు చేసిన రైతులు రూ. 12.75 కోట్ల మేరకు నష్టపోయారు. జిల్లాలో 850 ఎకరాల్లో వంగతోటలు సాగు చేపట్టారు. ఎకరం వంగతోటల సాగకు రూ. 1.25లక్షలు నుంచి రూ. 1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వంగ ధరలు రూ.5 లోపే ఉన్నాయి. మార్కెట్‌కు వంకాయల్ని తీసుకెళ్లినా గిట్టుబాటు ధరలు లేక పోవడంతో నష్టపోయారు.

కోయకుండా తోటల్లోనే వదిలేశాం

ఎకరం పొలంలో వంగపంట సాగు చేశాను. పంట సాగుకు రూ.లక్షకుపైగా ఖర్చు చేశాను. కాయలు మంచి అదను మీద ఉన్న సమయంలో ధరలు పూర్తిగా పడిపోయాయి. మార్కెట్లో కిలో రూ. 5వరకు ధరలు పలుకుతున్నాయి.. కాయలు మార్కెట్‌కు తీసుకెళితే చేతి నుంచి డబ్బులు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చేసేదిలేక కాయలు కోయకుండా తోటల్లోనే వదిలేశాం.

– అమరనాథ్‌, రైతు, గుర్రంకొండ

గిట్టుబాటు ధరలు లేవు

ప్రస్తుతం మార్కెట్లో వంగ ధరలు దారుణంగా పడిపోయాయి. టమాటాతో నష్టపోయిన రైతులకు వంగ సాగుతో కొంత ఊర ట వస్తుందనుకొంటే ఇది కూడా నట్టేట ముంచింది. మార్కెట్లో నెలరోజులుగా ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. పంట సాగుకు ఖర్చు చేసిన పెటుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలు లేక పోవడంతో వంగపై పెట్టుకొన్న ఆశలు అడియాసలు అయ్యాయి.

– ఆంజినేయులు, వంగరైతు, తలారివాండ్లపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement