13 మంది నిందితులకు జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

13 మంది నిందితులకు జైలు శిక్ష

Mar 26 2026 7:41 AM | Updated on Mar 26 2026 7:41 AM

పెద్దతిప్పసముద్రం : ఒంటరిగా ఉన్న ఓ మహిళపై 13 మంది దాడి చేసి ఇంట్లో ఉన్న విలువైన వస్తు సామగ్రి, వ్యవసాయ యంత్ర పరికరాలు ధ్వంసం చేసిన కేసులో 13 మంది నిందితులకు తంబళ్లపల్లె కోర్టు న్యాయమూర్తి బుధవారం శిక్షతో పాటు జరిమానా విధించారు. ఎస్‌ఐ పరమేశ్‌ నాయక్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పులికల్లు పంచాయతీ గుడ్డంపల్లికి చెందిన లచ్చన్నగారి శివన్న, సరస్వతి దంపతుల కుమారుడు వినోద్‌ ఇదే గ్రామానికి చెందిన సందే ఏసప్ప కుమార్తె భవానీ అనే యువతితో కలసి 2017 ఆగస్టు 3న ఎటో వెళ్లిపోయారు. తమ కుమార్తె ఎక్కడుందో కనిపెట్టి తమకు అప్పగించాలని భవాని కన్నవాళ్లు యువకుడి కన్నవాళ్ళను హెచ్చరించారు. అనంతరం అదే రోజు యువకుడి తల్లి ఇంట్లో ఒంటరిగా ఉండగా యువతి కన్నవాళ్లు, బంధువులైన చాకివేలు శంకర్‌, ఆదెప్ప, వెంకటరమణ, సుధాకర్‌, నారప్ప, బత్తెప్ప, ప్రతాప్‌, భాస్కర్‌, దేవి, సుబ్బలమ్మ, లక్ష్మిదేవి, సుమిత్ర, శారదలు మూకుమ్మడిగా మారణాయుధాలతో ఇంట్లోకి జొరబడి విలువైన వస్తువులతో పాటు ఇనుప గేట్లు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఒంటరిగా ఉన్న సరస్వతిని చంపుతామని బెదిరించారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా దాడికి పాల్పడి భయబ్రాంతులకు గురి చేశారు. అనంతరం సమీపంలోని వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి అక్కడ ఉన్న బోరు సామగ్రి, విద్యుత్‌ పరికరాలను ధ్వంసం చేశారు. జరిగిన ఘటనపై బాధిత మహిళ సరస్వతి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ రవికుమార్‌ కేసు నమోదు చేశారు. 9 ఏళ్ల నుంచి కొనసాగుతున్న కేసుకు సంబంధించి బుధవారం తంబళ్లపల్లి కోర్టులో తుది విచారణ కొనసాగింది. బాధితురాలి తరఫున ఏపీపీ వీరాంజనేయులు వాదించారు. తుది వాదనలు విన్న సివిల్‌ జడ్జి ఏ. ఉమర్‌ ఫరూక్‌ దాడికి పాల్పడిన 13 మంది నిందితులకు ఆరు నెలల జైలుశిక్షతో పాటు ఒకొక్కరికి రూ.2 వేల జరిమానా విధించినట్లు ఎస్‌ఐతో పాటు కోర్టు కానిస్టేబుల్‌ బావాజాన్‌లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement