వాల్మీకిపురం : పట్టాభిరాముడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం స్వామివారు తన ప్రియభక్తుడైన హనుమంతునిపై పురవీధుల్లో విహరిస్తూ .. భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన అనంతరం ఉదయం 8గంటలకు స్వామివారిని ముత్యపుపందిరి వాహనంపై పురవీధుల్లో విహరించారు. ఉదయం 10గంటలకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిపారు.
సాయంత్రం ఊంజల మండపంలో ఊంజల్ సేవ నయనానందకరంగా నిర్వహించారు. బుధవారం రాత్రి 8గంటలకు ఉత్సవర్లను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు స్వామివారికి నేతి దీపాలతో తిరుమాడ వీధుల్లో స్వాగతం పలికారు. టీడీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటాలు, చెక్కభజనలు, మంగళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్, భక్తులు పాల్గొన్నారు.
నేడు : బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం 8గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 8గంటలకు సింహ వాహన సేవ.
వైభవంగా ముత్యపుపందిరి వాహనం


