కడప అర్బన్ : కడప నగరం ఎరమ్రుక్కపల్లె సర్కిల్ సమీపంలోని ఓ వైన్ షాప్ వద్ద బుధవారం రాత్రి రవి,భాస్కర్ అనే యువకులపై కొందరు యువకులు కత్తులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో వన్ టౌన్ ఎస్‌ఐ ప్రదీప్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిని యువకులను వైద్య పరీక్షల కోసం రిమ్స్‌కు తరలించారు. పోలీసు అధికారులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు కడపకు చెందిన త్రిపుర పాటి భాస్కర్, తన స్నేహితుడు రవి, స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. వైన్ షాప్ నుంచి బయటికి రాగానే భాస్కర్,రవిలపై కొందరు కత్తులతో దాడి చేశారు.నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాయచోటిలో గ్యాంగ్ వార్
రాయచోటి : రాయచోటిలో తెలుగుతమ్ముళ్ల గ్యాంగ్‌వార్ పోటాపోటీగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారపార్టీలోని కొంతమంది నాయకులు తమకు అనుకూలమైన గ్యాంగ్‌లను ఏర్పాటు చేసి దాడులు, దందాలకు యత్నిస్తున్నారు. ఇప్పటికే పలుపర్యాయాలు రాయచోటిలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. బుధవారం సాయంత్రం మదనపల్లె మార్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో కె. రామాపురం గ్యాంగ్‌కు చెందిన లతీష్ (20)పై ఎన్‌ఎన్ కాలనీ గ్యాంగ్ దాడిచేసింది. సుమారు 30 మంది సభ్యులు వారివెంట తెచ్చుకున్న స్టిక్స్, రాడ్లు, చైన్‌లతో క్రికెట్ ఆడుతున్న లతీష్‌ను కొట్టారు. తీవ్ర గాయాలతో పడిపోయిన లతీష్‌ను అక్కడ వదిలేసి ఎస్‌ఎన్ కాలనీ బ్యాచ్ వెనుదిరిగింది. విషయాన్ని తెలుసుకున్న కెఆర్ పురం గ్యాంగ్ సుమారు 50 మంది యువకులు సంఘటనా స్థలానికి చేరుకొని దాడికి పాల్పడిన వారికోసం గాలింపు చేపట్టినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన లతీష్‌ను చికిత్సనిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లతీష్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఫోన్ ద్వారా పరామర్శించారు. దాడిచేసిన వర్గం మంత్రి అనుచరవర్గానికి చెందినది కావడంతో పోలీసులు కేసు నమోదు చేసే విషయంలో పరిశీలన చేస్తున్నట్లు తెలియవచ్చింది.
అరటి పంట దగ్ధం
కాశినాయన : మండలంలోని ఆకులనారాయణపల్లె గ్రామానికి చెందిన కర్ర రఘునాథ్ రెడ్డి అనే రైతుకు చెందిన రెండు ఎకరాల అరటి పంట బుధవారం దగ్ధమైంది. రైతు కథనం మేరకు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి రెండు ఎకరాల్లో అరటి పంట కాలిపోయిందన్నారు. రూ.2లక్షల మేర నష్టం వచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.


