మదనపల్లెటౌన్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి కురబలకోట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ముదివేడు పోలీసులు తెలిపిన వివరాలు.. కడప శ్రీనివాస వీధికి చెందిన యాసీన్ (22), అదే ప్రాంతానికి చెందిన అతని స్నేహితుడు జశ్వంత్(22) మదనపల్లె మిట్స్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఇద్దరు సొంత పనిమీద ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని అదే రాత్రే అంగళ్లులో ఉన్న హాస్టల్‌కు బయలుదేరారు. కురబలకోట మండలం, చేనేతనగర్ వద్దకు రాగానే కల్యాణ మండపానికి పెళ్లికి వచ్చిన కనసానవారిపల్లెకు చెందిన గంగుల్ రెడ్డి(60) రోడ్డు క్రాస్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థుల బైకు ఢీకొంది. ఈ ఘటనలో గంగుల్ రెడ్డితో పాటు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంగుల్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతికి రెఫర్ చేశారు. ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధురామ చంద్రడు తెలిపారు.


