● ఏడుగురు కడప వాసులకు తీవ్ర గాయాలు
● రెండో మలుపు వద్ద ఘటన
● వరుస ప్రమాదాలతో
పర్యాటకుల్లో ఆందోళన
బి.కొత్తకోట : రోజూ వరుస ప్రమాద ఘటనలతో.. పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ వచ్చే పర్యాటకులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం టాటా ఏస్ ప్రమాదం, సోమవారం బైక్ ప్రమాదం జరగ్గా.. మంగళవారం కడప పర్యాటకుల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. దీనికి సంబంధించి స్థానికులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం అల్మాస్‌పేటకు చెందిన ఎస్.యూసుఫ్ (25), ఎస్.జాఫర్ (25), ఎస్.అహమ్మద్ బాషా (26), ఎస్.మస్తాన్ (36), ఎస్.జుబేర్ అహమ్మద్(25), ముస్తఫా(26) మిత్రులు. వీరంతా సరదాగా హార్సిలీహిల్స్ పర్యటనకు వెళ్లాలి, చల్లని వాతావరణంలో సేద తీరాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం మంగళవారం తెల్లవారుజామున ఆటోలో కడప నుంచి హార్సిలీహిల్స్‌కు బయలుదేరారు. వీరు ఉదయం ఏడు గంటలకు కొండపైకి చేరుకున్నారు. కొండపై ప్రకృతి అందాలు తిలకిస్తూ, సంతోషంగా వినోదాలు పంచుకున్నారు. అనంతరం తిరిగి స్వస్థలానికి వెళ్లేందుకు మధ్యాహ్నం కొండపై నుంచి వెనుతిరిగారు. మొదటి మలుపు దాటుకుని కాఫీ తోటల వద్ద రెండో మలుపు దాటే సమయంలో.. బ్రేక్ వైర్ కట్ కావడంతో ఆటో వేగ నియంత్రణ సాధ్యం కాలేదు. దాంతో ఆటో మలుపు వద్ద బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి తల, ముఖం, కాళ్లు, చేతులు, శరీరం పైన తీవ్ర రక్త గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో బాధితులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. గాయాల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోడ్డుపైన, ఆటోలో బాధితులు ఉండిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వారికి ప్రాథమిక వైద్యం అందించి మదనపల్లె జిల్లా ఆసుపత్రి తరలించారు. ఇక్కడ వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరుస ప్రమాదాలు
హార్సిలీహిల్స్ వచ్చే పర్యాటకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆదివారం మొదలైన ప్రమాదాల పరంపర వరుసగా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మదనపల్లి ఎస్టేట్‌కు చెందిన పర్యాటకులు కొండకు వెళ్లి తిరిగి వస్తుండగా మూడో మలుపు వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం ఇదే మలుపు వద్ద గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఆటో ప్రమాదం జరిగి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతిరోజు ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉంటే పర్యాటక కేంద్రం కాస్త ప్రమాదాల కేంద్రంగా మారిపోయే పరిస్థితి ఉంది. తద్వారా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రమాదాల నివారణకు అధికారులు సత్వరమే కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సిన తక్షణ అవసరం ఉంది.
బోల్తా పడిన ఆటో రోడ్డుపై పడిన బాధితుడు


