పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Mar 25 2026 7:12 AM | Updated on Mar 25 2026 7:12 AM

వైభవంగా ధ్వజారోహణం

గజవాహనంపై స్వామి వారి విహారం

ధ్వజారోహణం నిర్వహిస్తున్న వేదపండితులు

గజవాహనంపై శ్రీ పట్టాభిరాముడి ఊరేగింపు

వాల్మీకిపురం : వాల్మీకిపురంలో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీ పరాభవనామ సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి 8.50 మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి టీటీడీ వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపజేశారు. ఈ సందర్భంగా నాగదోష, సంతాన ప్రాప్తి కోసం మహిళలకు ప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ పట్టాభిరాములవారి ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం ఊంజల్‌సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, అలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్‌, సిబ్బంది, వైఎస్సార్‌సీపీ నాయకులు చింతల ఆనంద రెడ్డి, కేశవరెడ్డి, రామక్రిష్ణరెడ్డి, శ్రీనివాసులు, పులిబ్రదర్స్‌, భక్తులు పాల్గొన్నారు.

గజవాహనంపై శ్రీ పట్టాభిరాముడు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు పట్టాభిరాముడు రాత్రి 8 గంటల నుంచి గజవాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. కోలాటాలు, చెక్కభజనలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ పట్టాభిరామస్వామి గజవాహనంపై ఊరేగారు. వాహనాల ఎదుట మహిళలు పిండిదీపాలతో స్వాగతం పలికారు. భక్తులు అడుగడునా కొబ్బరికాయలు కొడుతూ... కర్పూర హారతులతో స్వామిని సేవించుకున్నారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ముత్యపుపందిరి వాహనం, సాయంత్రం ఊంజల్‌సేవ, రాత్రి హనుమంత వాహనం సేవ కార్యక్రమాలు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement