పులిచెర్ల(కల్లూరు): నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వివిధ కోర్టుల్లో ష్యూరిటీగా వినియోగిస్తున్న ముఠాను కల్లూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పులిచెర్ల ఎంపీడీఓ రాజశేఖరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు ఎస్పీ తుషార్‌ఢూడీ ఆదేశాలతో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, కల్లూరు సీఐ జయరామయ్య, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంపీడీఓ పులిచెర్ల, చిన్నగొట్టిగల్లు పంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ సీళ్లు తయారు చేసి, వాటితో నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ పత్రాల ద్వారా తిరుపతి, పాకాల, పుంగనూరు, పీలేరు, చిత్తూరు కోర్టుల్లో సుమారు 200 మందికి పైగా నిందితులకు ష్యూరిటీలను సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సీళ్లు, రబ్బరు స్టాంపులు, ఇంక్‌ప్యాడ్, వ్యాల్యుయేషన్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకొన్నారు. పులిచెర్ల 106 రామిరెడ్డిగారిపల్లెకు చెందిన డి.ఆంజనేయులు, సి.రవి, చిన్నగొట్టిగల్లుకు చెందిన నీల వెంకటరమణ, తిరుపతికి చెందిన పి.బ్రహ్మయ్య, బాలసుబ్రహ్మణ్యంలను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఐదుగురు అరెస్ట్


