నెల రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం | - | Sakshi
Sakshi News home page

నెల రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

Mar 21 2026 5:08 AM | Updated on Mar 21 2026 5:08 AM

● చావులోనూ కలిసే..

సర్కార్‌ తోపులో డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

మృత్యువాత పడిన ముగ్గురు స్నేహితులు

మరణంలోనూ వీడని స్నేహ బంధం

సురేంద్ర, మహేష్‌, మాధవ (ఫైల్‌)

కురబలకోట మండలం సర్కారుతోపులో చనిపోయిన ముగ్గురు చిన్న నాటి నుంచి మంచి స్నేహితులు. బి.కొంతకోటకు చెందిన సురేంద్ర మదనపల్లెకు రోజూ వచ్చి ఇక్కడ ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి తన తల్లిని పోషించకునేవాడు. అలాగే అమ్మచెరువు మిట్టకు చెందిన మహేష్‌ టీవీల మెకానిక్‌. మాధవ భవన నిర్మాణ కార్మికుడు. రోజూ మదనపల్లెలోనే ముగ్గురు కలిసేవారు. కలసి పని చేసే వారు కూడా. విడదీయరాని స్నేహం వారిది కావడంతో రాత్రి జరిగిన బైక్‌ ప్రమాదంలో మృత్యువు ముగ్గురిని కబళించింది. చావులోనూ వీడని స్నేహానుబంధం వారిదని పలువురు కన్నీరు పెట్టారు.

మదనపల్లెటౌన్‌ : నెల రోజుల్లో బి.కొత్తకోట, మదనపల్లెకు చెందిన ఓ జంటకు పెళ్లి జరగాల్సి ఉంది. పండుగ పూట కడుపు నిండా తిని వెళ్లాలని కాబోయే భార్య కోరడంతో.. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో గురువారం రాత్రి జరుగుతున్న శ్రీచౌడేశ్వరీదేవి జ్యోతి ఉత్సవాలకు వచ్చిన యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తనతోపాటు వెంట వచ్చిన మరో ఇద్దరి స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. చావులోనూ వారి స్నేహ బంధం వీడలేదు. ముగ్గురు మృతి చెందడంతో బి.కొత్తకోట మదనపల్లెకు చెందిన మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి.. ముగ్గురు యువకులు మృతి చెందడం పాఠకులకు తెలసిందే. ఈ విషాదకర ఘటనపై ముదివేడు పోలీసులు, మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బి.కొత్తకోట కరెంటు కాలనీకి చెందిన జరిపిటి రఘు, నాగరత్న దంపతుల కుమారుడు జి.సురేంద్ర (23) డిగ్రీ వరకు చదువుకున్నాడు. మిలటరీ, ఆర్మీ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో మదనపల్లెకు చెందిన సమీప బంధువుల యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి కుదిర్చారు. మరో నెల రోజుల్లో ఇద్దరికి పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలో రాత్రి మదనపల్లె పట్టణం నీరుగుట్టవారిపల్లెలో చౌడేశ్వరీ అమ్మవారి ఉత్సవం జరిగింది. ఈ వేడుకలకు కాబోయే భార్య ఆహ్వానించింది. ఈ క్రమంలో సురేంద్ర రాత్రి మదనపల్లెకు వచ్చాడు. అమ్మచెరువు మిట్టకు చెందిన సుశీల వెంకటేశ్వర్‌ దంపతుల కుమారుడు టీవీల మెకానిక్‌ మహేష్‌ (22)తో కలసి స్థానిక చంద్రాకాలనీలో ఉన్న మరో స్నేహితుడైన అంజనమ్మ, నరసింహ దంపతుల కుమారుడు మాధవ(23)ను కలిశాడు. వారిద్దరినీ కూడా విందుకు సురేంద్ర తీసుకువెళ్లారు. ముగ్గురు తృప్తిగా భోజనం చేశారు. చివరిసారిగా, మళ్లీ కలుద్దాం అంటూ ఆమెతో మాట్లాడి.. స్పోర్ట్స్‌ బైక్‌పై సురేంద్ర తన ఇద్దరి స్నేహితులతో స్థానిక రింగురోడ్డుకు చేరుకున్నారు. అర్ధరాత్రి కావస్తోంది. తనను బి.కొత్తకోటలో వదలి రావాలని మహేష్‌, మాధవలను సురేంద్ర కోరడంతో.. బైక్‌లో బి.కొత్తకోటకు బయలు దేరారు. మార్గంమధ్యలోని కురబలకోట మండలం సర్కారుతోపు వద్దకు రాగానే బైకు అదుపు తప్పిరోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గరిలో మహేష్‌, మాధవలు అక్కడికక్కడే మృతి చెందగా, సురేంద్రను కురబలకోట 108లో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి గాయపడ్డ బాధితుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమా?

స్నేహితులు ముగ్గురు కలసి బి.కొత్తకోటకు బైకులో బయలుదేరారు. స్పోర్ట్స్‌ బైక్‌లో వెళ్లే క్రమంలో మహేష్‌ బైక్‌ను స్పీడుగా నడపడం జరిగినట్లు సంఘటన జరిగిన తీరును బట్టి తెలుస్తోందని ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపారు. బైకు అదుపు తప్పడం వల్లనే రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెబుతున్నారు.

కొత్తకోటకు బయలుదేరకుండా ఉంటే..

‘సురేంద్ర కొత్తకోటకు పోకుండా జాతరలో ఉండి ఉన్నా.. ఆ చౌడేశ్వరమ్మ నా బిడ్డలను బతికించేది’ అని మృతుడి తల్లి నాగరత్న కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆరు నెలల క్రితం ఆ దేవుడు తన భర్తను పైకి తీసుకు పోయాడు. చేదోడు వాదోడుగా ఉన్న తన బిడ్డను దూరం చేసి తనను ఒంటరిదాన్ని చేశాడు. ‘నేనేమి పాపం చేశాను తండ్రీ’ అంటూ మృతుడు సురేంద్ర తల్లి గుండెలవిసేలా విలపించడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలచివేసింది.

మూడు కుటుంబాల్లో ..

బి.కొత్తకోట కరెంటు కాలనీ, మదనపల్లె అమ్మచెరువు మిట్ట, చంద్రా కాలనీల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లీడుకు వచ్చిన ముగ్గురు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం అలుముకుంది. చేతికందివచ్చిన బిడ్డలు ఇక లేరని గుండెలు బాదుకుంటూ విలపించడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.

చావులోనూ వీడని స్నేహానుబంధంగా యువకుల మృతదేహాలు, విలపిస్తున్న సురేంద్ర, మాధవ తల్లులు

‘కురబలకోట మండలంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పసిబడ్డలు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానే కలచివేసింది. వారి తల్లిదండ్రులకు ఆ లోటును ఆ దేవుడు కూడా పూడ్చలేడు’ అని ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా తెలిపారు. జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్దకు శుక్రవారం వచ్చిన ఎమ్మెల్యే మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. బిడ్డలు ఇంటికి వస్తారని వేయికళ్లతో ఎదురు చూసిన తల్లిదండ్రులకు కలిగిన లోటును.. ఆ దేవుడు కూడా పూడ్చలేడన్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటానని హాహా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement