మదనపల్లె టౌన్ : మదనపల్లెలో ఓ దొంగ అర్ధరాత్రి వేళలో వరుస చోరీలకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నిందితున్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సొసైటీ కాలనీ, ఆర్టీసీ బస్టాండు ప్రాంతాల్లో ఓ దొంగ అర్ధరాత్రి వేళల్లో ప్రయివేట్ ఆస్పత్రుల్లో చొరబడి వరుసగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు దొంగ కోసం ప్రత్యేక బృందాలతో శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే దొంగను పట్టుకుని ఆస్పత్రులలో చోరీలు జరగకుండా అరికట్టనున్నట్లు తెలిపారు.
గోదావరిలో మదనపల్లె విద్యార్థి మృతి
మదనపల్లె టౌన్ : భద్రాచలం పరిధిలోని కొత్తగూడెం వద్ద గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు శుక్రవారం గల్లంతయ్యారు. ఏడుగురు విద్యార్థులు నదిలోకి దిగగా వారిలో ఐదుగురు కొట్టుకు పోయారు. ఇద్దరు సురక్షితంగా బయట పడగా అభిరామ్, శ్రీకర్ , తేజ, సతీష్ , నవదీప్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. గత ఈతగాళ్లతో స్థానిక పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. చనిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన సతీష్ ఉన్నట్లు అక్కడి పోలీసులు మదనపల్లె తాలుకా పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. దీంతో గోదావరి నదిలో ఈతకు వెళ్లి గల్లంతయిన విద్యార్థుల ఘటన వెలుగులోకి వచ్చిందని స్థానిక పోలీసులు తెలిపారు.
మదనపల్లె యువకుడు
తిరుపతిలో మృతి
మదనపల్లె టౌన్ : మదనపల్లె యువకుడు తిరుపతిలో మృతి చెందినట్లు అక్కడి ఈస్ట్ పోలీసులు మదనపల్లె వన్ టౌన్ పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ రహీముల్లా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి పట్టణం ఎస్వీ మెడికల్ కాలేజీ–రుయా రోడ్డులోని ఫుట్ పాత్‌పై మదనపల్లె యువకుడు మృతి చెంది ఉండటాన్ని ఈస్ట్ పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్, పాన్ కార్డులో మృతుడు మదనపల్లె మండలం పొన్నూటి పాళ్యం కుమారపురం నమాజు కట్ట ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుమారుడు ఎం.ప్రేమ్‌కుమార్(30)గా గుర్తించారు. వారు వెంటనే మదనపల్లె పోలీసులకు సమాచారం అందించారు. సంబంధీకులు మృతదేహాన్ని గుర్తించి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు.


