● పీటీఎం గ్రామ సచివాలయంలో
బిల్ బుక్కులు గల్లంతు
● ముగ్గురు కార్యదర్శులు, బిల్
కలెక్టర్లపై చర్యలకు సిఫారసు
● విచారణ చేపట్టిన డీఎల్పీవో
పెద్దతిప్పసముద్రం : స్థానిక గ్రామ సచివాలయంలో గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శుల వ్యవహారశైలి చూస్తుంటే ప్రజల సొమ్మును దోచుకో.. దాచుకో అన్నట్లుగా ఉంది. గత మూడేళ్లుగా ఇంటి, నీటి పన్నులకు సంబంధించి ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ములో రూ.లక్షల డబ్బు గోల్‌మాల్ అయినట్టు తెలుస్తోంది. పన్నుల వసూళ్ల రికార్డులు గల్లంతు కావడం వెనుక ఎవరి పాత్ర ఉందో విచారణలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది. స్వర్ణ పంచాయతీలో భాగంగా పన్నుల వసూళ్లలో పీటీఎం వెనకబడటంతో డిప్యూటీ ఎంపీడీవో ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మదనపల్లి డీఎల్పీవో నాగరాజు రంగంలోకి దిగి ఇటీవల విచారణ చేపట్టారు.
రూ.30 లక్షల ప్రజాధనం గోల్‌మాల్
స్థానిక గ్రామ పంచాయతీలో 1,800 దాకా గృహాలు ఉన్నాయి. ఒక్కో ఇంటికి ఏడాదికి రూ.500 నుంచి రూ.3 వేల దాకా ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. ఒక్కో గృహానికి సగటున రూ.500 వసూలు చేసినా ఏడాదికి రూ.9 లక్షల నగదు పన్నుల రూపంలో వస్తుంది. 2023–2024 ఆర్థిక సంవత్సరం నుంచి గత ఏడాది జూన్ వరకు దాదాపుగా రూ.30 లక్షల వరకు వసూలు అయినట్టు తెలుస్తోంది. అయితే పన్నుల వసూళ్లకు సంబంధించిన రికార్డులు గల్లంతు అయ్యాయి. వసూలు చేసిన సొమ్ము ట్రెజరీకి ఎంత జమ చేశారు, సిబ్బందికి చెల్లించిన జీత,భత్యాల రికార్డులు సైతం అందుబాటులో లేకపోవడం శోచనీయం. ఇదిలా ఉండగా కొత్తగా గృహాలు నిర్మించేందుకు పంచాయతీ నుంచి ప్లాన్ అప్రూవల్‌లో కూడా కార్యదర్శులు పెద్ద మొత్తంలోప్రజల సొమ్ము స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.


