మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న
ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలు, పోలీసులు
మొల్లమాంబ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న
డీఆర్‌ఓ, అధికారులు
మదనపల్లె : తెలుగభాష, సంస్కృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ సమావేశ హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కడప జిల్లా గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రని అన్నారు. ఆమె రచనా శైలి చాలా సరళమైనది, రమణీయమైనదన్నారు. తాళ్లపాక అన్నమయ్య భార్య తాళ్లపాక తిమ్మక్క తర్వాత రెండవ తెలుగు కవయిత్రిగా మొల్లకు కీర్తి దక్కిందన్నారు. శ్రీరాముని చరిత్రను ఎందరో రచించినప్పటికీ తెలుగుభాషలో మొల్ల రామాయణం ప్రత్యేకమన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి తేజస్విని మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయల కాలంలో మొల్ల రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వేమనారాయణ, వైస్ ప్రెసిడెంట్ ఎం.శ్రీరాములు, ట్రెజరర్ రెడ్డప్ప, జనరల్ సెక్రటరీ లోకేష్, ఆర్గనైజర్ గోపి, రిటైర్డ్ తెలుగు పండిట్ ఏవీవీ ప్రసాద్ శర్మ, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.
పోలీసు కార్యాలయంలో..
రాయచోటి : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు శుక్రవారం రాయచోటిలోని పోలీసు కార్యాలయంలో ప్రముఖ కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ డి.ఏడుకొండలరెడ్డి కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి పుష్పగుచ్ఛాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏఆర్ డీఎస్పీ మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ కవయిత్రిగా ఆమె విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌తోపాటు పలు ప్రధాన నగరాలలో ప్రతిష్టించడం ఆమె గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) విజె రామకృష్ణ, పలువురు పోలీసు అధికారులు, జిల్లా కార్యాలయం సిబ్బంది, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.


