లక్కిరెడ్డిపల్లి : మండలంలోని రాయచోటి–వేంపల్లి జాతీయ రహదారి మార్గంలోని లక్కిరెడ్డిపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చక్రాయపేట మండలం, దేవరగుట్టపల్లికి చెందిన జగదీష్, ఓబయ్య అనే ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. రాయచోటి నుంచి పనులు ముగించుకొని స్వగ్రామమైన చక్రాయపేట మండలం దేవరగుట్టపల్లికు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా లక్కిరెడ్డిపల్లి సమీపంలో వేంపల్లి నుంచి రాయచోటికి వెళ్తున్న ఇన్నోవా కారు టైర్ పగిలి ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని రాయచోటికి తీసుకెళ్లగా వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శోభ తెలిపారు.
స్కౌట్ మాస్టర్లు రోల్ మోడల్‌గా ఎదగాలి
రాయచోటి : స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు రోల్‌మోడల్‌గా ఎదగాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటిలోని డైట్‌లో ఏర్పాటు చేసిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ లీడర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కౌట్ శిక్షణతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు సమకూరుతుందన్నారు. స్కౌట్‌లో చేరడం ద్వారా విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రులతో, గురువులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్కౌట్ యూనిట్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి అన్నారు. స్కౌట్‌లో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ సౌకర్యం కలదన్నారు. అన్నమయ్య జిల్లాలో స్కౌట్ ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం జరుగుతూ ఉందన్నారు. అనంతరం ఇటీవలే బేసిక్, అడ్వాన్స్ శిక్షణ పూర్తి చేసుకున్న స్కౌట్ మాస్టర్లకు, గైడ్ కెప్టెన్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎల్‌టి లక్ష్మీకర్, ఆపదమిత్ర కోఆర్డినేటర్ గురునాథరెడ్డి, అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్ మార్ల ఓబుల్‌రెడ్డి, అలిశెట్టి మధు, గైడ్ కెప్టెన్లు శివలీల, సుజాత, స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు తదితరులు పాల్గొన్నారు.
గాయపడిన జగదీష్, ఓబయ్య


