రైల్వేకోడూరు: కోట్ల రూపాయల ఖర్చుతో వేసిన రోడ్డు నేడు వాడకం లేక ఇలా మారింది.
రాయచోటి: యంఐజీలో పరిస్థితి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో సొంత గూడు కట్టుకోవాలన్న మధ్యతరగతి ప్రజల ఆశలపై నీలి నీడలు అలుముకున్నాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మహోన్నత ఆశయంతో, లాభాపేక్ష లేకుండా తక్కువ ధరకే ప్లాట్లు అందించా లని చేపట్టిన ఎంఐజీ లేఅవుట్ల ప్రాజెక్టును ప్రస్తుత కూటమి సర్కార్ పూర్తిగా పెడచెవిన పెట్టింది. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించి న మౌలిక వసతులు నేడు వృథాగా మారుతుండగా, ప్లాట్లు కొనుగోలు చేసిన వేలాది మంది లబ్ధిదారులు అగమ్యగోచర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
నాడు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి..
గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పట్టణాలకు చేరువలో, ఆహ్లాదకర వాతావరణంలో భూములను సేకరించారు. రాయచోటి దిగువ అబ్బవరం వద్ద 31.07 ఎకరాల్లో మొదటి విడత లేఅవుట్ వేసి 233 మందికి ప్లాట్లు కేటాయించగా, విపరీతమైన డిమాండ్ రావడంతో మరో 20 ఎకరాలను అదనంగా సేకరించారు. అప్పట్లో రింగ్ రోడ్డు నుంచి లేఅవుట్ వరకు అద్భుతమైన డబుల్ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వసతులను కల్పించారు. కానీ నేడు ఆ రోడ్లు వాడకం లేక, నిర్వహణ కరువై కంపచెట్లతో నిండి అడవిని తలపిస్తున్నాయి.
కక్షసాధింపులో సామాన్యుడి బలి!
జిల్లావ్యాప్తంగా 150, 200, 260 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేసినా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం మానేసింది. ప్లాట్లు పొందిన వారికి రిజిస్ట్రేషన్లు చేయడంలోనూ, మిగిలిన మౌలిక సదుపాయాలు పూర్తి చేయడంలోనూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన పథకం కావడం వల్లే దీనిని అటకెక్కించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా కూటమి సర్కార్ కక్షసాధింపు రాజకీయాలు మాని, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిలిచిపోయిన ఈ లేఅవుట్లను మున్సిపాలిటీల ద్వారా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
పూర్వపు అన్నమయ్య జిల్లాలో అగమ్యగోచరంగా ఎంఐజీ లేఅవుట్లు
నాడు ‘హాట్ కేకుల్లా’ ప్లాట్ల విక్రయం.. నేడు కంపచెట్ల రాజ్యం
6 నియోజకవర్గాల్లో 132 ఎకరాలభూసేకరణ జరిగినా నిలిచిన పనులు
అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కూటమి సర్కార్ నిర్లక్ష్యం


