సాక్షి అన్నమయ్య/మదనపల్లెటౌన్: అన్నమయ్య జిల్లా వాసుల ఆరోగ్య ప్రదాయిని, మదనపల్లె జిల్లా ఆసుపత్రి నేడు పాలకుల నిర్లక్ష్యానికి బలై ‘అనారోగ్యం’తో కొట్టుమిట్టాడుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది, నిరుపేదలకు అత్యున్నత వైద్యం అందించాలని సంకల్పించి కోట్లాది రూపాయలు వెచ్చించారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే ఆశల మీద నీళ్లు చల్లింది. మెడికల్ కాలేజీని నిర్వీర్యం చేయడం, సిబ్బందిని ఇతర ప్రాంతాలకు తరలించడంతో ఈ పెద్దాసుపత్రి నేడు కేవలం ‘రెఫరల్ సెంటర్’గా మారిపోయింది.
డాక్టర్ల అవతారమెత్తిన ఫార్మసీ విద్యార్థులు!
ఆసుపత్రిలో ప్రస్తుతం కేవలం 23 మంది డాక్టర్లే ఉండగా, అందులో నూ కొందరు సెలవులో వెళ్లడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఉన్న వైద్యులు తమ సొంత క్లినిక్కులకే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యాహ్నం 12 దాటితే ఓపీడీలో కనిపించడం లేదు. ఈ లోటును కప్పిపుచ్చడానికి ఒక ప్రైవేట్ కళాశాల ఫార్మసీ విద్యార్థులకు డాక్టర్ల కోట్లు వేయించి వారితో వైద్యం చేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
గతంలో మహర్దశ.. నేడు దుస్థితి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. కోట్ల ఖరీదైన అధునాతన ల్యాబొరేటరీలు (బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజీ), గ్యాస్ స్టేషన్, ఐసీయూ, కొత్త ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.9 కోట్లతో అదనపు అంతస్తులను నిర్మించింది. కానీ నేడు:
వెంటిలేటర్ల కొరత: తీవ్ర గాయాలతో వచ్చే వారికి కనీసం వెంటిలేటర్ సదుపాయం లేక తిరుపతికి రెఫర్ చేస్తున్నారు. గంటల ప్రయాణం భరించలేక మార్గమధ్యలోనే ప్రాణాలు పోతున్నాయి.
ఆపరేషన్లు నిల్: ఏడాది కాలంగా ప్రధాన శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి.
మందుల కరువు: బడ్జెట్ కోత కారణంగా మందుల్లేవని ఫార్మసీ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.
పరీక్షలకు నిరీక్షణ: ఉదయం రక్తం ఇస్తే సాయంత్రం వరకు రిపోర్టులు రాకపోవడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిరుపేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, మెడికల్ కాలేజీని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తె చ్చి, నిపుణులైన డాక్టర్లను నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


