మదనపల్లె : గ్రామ పంచాయతీలకు సర్పంచులే కీలకం.. అయితే వారి పదవీ కాలం ముగుస్తోందని వారిపై నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది. మంగళవారం మదనపల్లె రూరల్ మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పథకాల నిధుల వినియోగంపై సమీక్షించారు. అయితే సర్పంచులను ఈ సమావేశానికి పిలవకుండానే నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులు కూడా సర్పంచులను విస్మరించారు. దాంతో టీడీపీ నేతలకు అభివృద్ది పనులు కట్టబెట్టేలా ఏకపక్ష నిర్ణయాలతో చర్యలు చేపట్టనున్నట్టు కనిపిస్తోంది.
రెండుకు చేరిన మృతుల సంఖ్య
మదనపల్లె టౌన్ : మదనపల్లె పుంగనూరు రోడ్డులోని క్రిష్ణాపురం జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి తాలుకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. వలసలపల్లె పంచాయతీ పుంగనూరు రోడ్డులోని క్రిష్ణాపురానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు శివప్రసాద్(28), అన బావమరిది మోహిత్(6)ను వలసపల్లె కాలనీలో వదిలి రావడానికి బైకులో అర్ధరాత్రి బయలుదేరాడు. స్కూటర్‌లో వెళ్తుండగా సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మురళి(35) పలమనేరుకు వస్తుండగా రెండు బైకులు జ్యూస్ ప్యాక్టరీ వద్ద ఢీకొన్నాయి. ఈ సంఘటనలో శివప్రసాద్ అక్కడికక్కడే దుర్మరణం చెందడం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన కదిరికి చెందిన మురళి, క్రిష్ణాపురానికి చెందిన మోహిత్‌లను స్థానికులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించారు. మురళి పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు వచ్చి బెంగళూరుకు తరలించారు. అక్కడ ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మురళి మృతితో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య రెండుకు చేరిందని సీఐ తెలిపారు.. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు మోహిత్‌కు ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉండగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


