మదనపల్లె రూరల్ : పట్టణంలో మల్చింగ్ షీట్ విక్రయించే దుకాణాల్లో వ్యవసాయ, ఉద్యాన, సేల్స్ టాక్స్ అధికారులు ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించారు. షాపుల్లోని స్టాకు వివరాలను పరిశీలించారు. మార్కెట్లో అమ్ముతున్న ధరలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ టమాటా పంట సాగులో మల్చింగ్ షీట్ ముఖ్యమైనదిగా ఉందన్నారు. మల్చింగ్ షీట్ అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు షాపులపై తనిఖీలు నిర్వహించామన్నారు. ప్రస్తుతం అన్ని షాపుల్లో పాత స్టాక్ ఉన్నందున, సరుకు అమ్ముడుపోయే వరకు పాతరేట్లకే మల్చింగ్ పేపర్ అమ్మకాలు జరపాల్సిందిగా ఆదేశించారు. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మల్చింగ్ షీట్ తయారీకి వాడే ముడిసరుకుల విలువ పెరగడంతో కొత్తగా తయారయ్యే మల్చింగ్ షీట్ ధరల్లో రోల్‌కు రూ.250 నుంచి 350 వరకు పెరిగే అవకాశం ఉందని షాపు యజమానులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మల్చింగ్ షీట్ కొనే ప్రతి రైతు తప్పనిసరిగా జీఎస్టీ బిల్లు తీసుకోవాలని తెలిపారు. షాపు యజమాని జీఎస్టీ బిల్లులు ఇవ్వకపోతే, రైతులు నేరుగా మండల వ్యవసాయ, ఉద్యాన లేదా సేల్స్ టాక్స్ అధికారులకు తెలపాలన్నారు. కార్యక్రమంలో మదనపల్లె ఉద్యానశాఖ అధికారి ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి, ఏఓ నవీన్‌కుమార్‌రెడ్డి, అసిస్టెంట్ సేల్స్‌ట్యాక్స్ ఆఫీసర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.


