● బి.కొత్తకోట నుంచి చలిమామిడి వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు డేగానిపల్లె వద్ద ప్రమాదం
● చెత్త తరలిస్తున్న ట్రాక్టర్‌ను అధిగమించే క్రమంలో అదుపుతప్పి పక్కనే కాలువలోకి దూసుకెళ్లింది
● బస్సులో 36 మంది ప్రయాణికులు..
అందులో 30 మంది విద్యార్థులు
● వీరిలో ముగ్గురు విద్యార్థులు, ఒక వ్యకిక్తి గాయాలు
బి.కొత్తకోట : 36 మంది ప్రయాణికులు, అందులో 30 మంది విద్యార్థులైన చిన్నారులతో సోమవారం సాయంత్రం బి.కొత్తకోట నుంచి చలిమామిడికి వెళ్తున్న ఆర్టీసీబస్సు డేగానిపల్లె వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి వాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు. సాయంత్రం మదనపల్లె ఒకటడిపోకు చెందిన ఆర్టీసీబస్సులో రోజూలాగే సూరప్పగారిపల్లె, కొత్తవుడియం, బలసరపెంట, చలిమామిడి, నామాలపల్లెకు చెందిన విద్యార్థులు చలిమామిడి వెళ్లేందుకు బస్సెక్కారు. వారితో ఆరుగురు మాత్రమే పెద్దలు ఉన్నారు. రోజూ వచ్చిపోయే బస్సు కావడంతో విద్యార్థులు ప్రయాణిస్తుండగా డేగానిపల్లె దాటగానే ఎదురుగా బి.కొత్తకోట నగర పంచాయతీకి చెందిన చెత్తను తరలిస్తున్న ట్రాక్టర్ దారి వస్తోంది. దారి ఇవ్వమంటూ బస్సు డ్రైవర్ హరన్ వేయగా ట్రాక్టర్ ఎడమవైపుకు వెళ్తోందని బస్సు ముందుకు వెళ్లింది. బస్సు వెళ్లేంత మార్గం లేకపోవడంతో బస్సు అదుపుతప్పి కుడిపక్కనే ఉన్న మూడడుగుల లోతులోని కాలువలోకి వెళ్లి ఒరిగిపోయింది. దాంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనకు గురై హాహకారాలు చేశారు. ఏమి జరిగిందో తెలియక, కేకలు, అరుపులు వినిపించడంతో పక్కనే ఉన్న డేగానిపల్లె గ్రామస్తులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. బస్సులో నుంచి విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. వారిలో కొత్తవుడియంకు చెందిన మూడో తరగతి విద్యార్థి శశాంక్ (9) ఎడమకాలు విరగ్గా, నాలుగో తరగతి విద్యార్థులు జశ్వంత్ (10), వర్షిణి (10) గాయపడ్డారు. నామాలపల్లెకు చెందిన టి.కోనప్ప కాలుకు తీవ్ర గాయం కావడంతో వారిని స్థానిక సీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం మదన పల్లె తరలించారు.
ఘటనస్థలిలో ఉద్రికత్త
ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబీకులు ఘటన స్థలానికి చేరుకుని నగర పంచాయతీ నుంచి చెత్తను తరలించే ట్రాక్టర్లు నడుపుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చలిమామిడిరోడ్డులోని డంపింగ్ యార్డులోకి నగర పంచాయతీలో సేకరించిన చెత్తను తరలిస్తున్నారు. గతంలోనూ చెత్త తరలించే ట్రాక్టర్ల డైవర్లు వాటిని నడుపుతున్న తీరును ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు గ్రామస్తులను వారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనలో ప్రాణాపాయం సంభవించి ఉంటే ఎవరు బాధ్యులను ప్రశ్నించారు. ఇకనైనా చెత్త తరలించే ట్రాక్టర్ల డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఏఎస్‌ఐ భాస్కర్ నాయక్, సిబ్బంది విచారణ చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆర్టీసీబస్సు, ట్రాక్టర్ డ్రైవర్లను విచారించారు. దీనిపై గ్రామస్తులు సమాచార ం ఇచ్చారు. రోడ్డుపై రాకపోకలకు అడ్డుగా ఉండటంతో పోలీసులు జేసీబి సహయంతో తొలగించే పనులు చేపట్టారు.
ఆ ప్రమాదం తలుచుకుని..
ఏడేళ్ల క్రితం ఇదే చలిమామిడి మార్గంలో అంజనేయస్వామి ఆలయం దాటాక జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఘటన తలుచుకుని గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 1992లో అచ్చమ్మ కొనమకు ముందున్న మిట్టపై ఆర్టీసీబస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం కలగలేదు. 30 మంది చిన్నారులతో వస్తున్న బస్సు ప్రమాదం విషాదం కలగించకపోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.


