మదనపల్లె : మదనపల్లె, పొరుగు మండలాల్లో అనధికార డీలర్లు టమాట రైతులను నిలువునా దోచుకుంటున్నారని బీజీపీ నేతల బృందం సోమవారం కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో వేల ఎకరాల్లో రైతులు టమాట పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటలు వినియోగించే మల్చింగ్ పేపర్ ఒక యూనిట్‌ను రూ.2,200కు విక్రయించాల్సి ఉండగా రూ.3,200కు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారన్నారు. సాధారణ రైతులు కష్టనష్టాలతో పంటను సాగు చేస్తుంటే ఈ అనధికార డీలర్లు ఎకరాకు అదనంగా సుమారు రూ.6వేల దాక దోచుకుంటున్నారని వివరించారు. తక్షణమే అనధికార డీలర్లు, అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అలాగే మదనపల్లెలో బుగ్గ కాలువ వద్ద ఉన్న అతి పురాతనమైన ఆలయాన్ని అక్రమించాలని రియల్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌కు ఫిర్యాదుచేసిన వారిలో బీజేపీ రాజంపేట జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్, పులి నరేంద్రకుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల కృష్ణమూర్తి, గోపాల్‌రెడ్డి ఉన్నారు.
బైక్‌ల ఢీ: యువకుడు మృతి
మదనపల్లెటౌన్ : స్కూటర్ ఢీకొని యువకుడు మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం అర్థరాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి తాలూకా సీఐ కళా వెంకటరమణ సో మ వారం ఉదయం మీ డియాకు తెలిపిన వివరాలు.. మండలంలోని వలసపల్లె గ్రామం, పుంగనూరు రోడ్డులోని క్రిష్ణాపురంకు చెందిన సుబ్రమణ్యం కొడుకు శివప్రసాద్(28) ఆదివారం అర్థరాత్రి వరకు ఇంట్లో టీవీ చూశాడు. అనంతరం తన బావ మరిది మోహిత్(6)ను వలసపల్లె కాలనీలో ఉన్న సోదరి ఇంట్లో వదిలి రావడానికి బైక్‌లో బయలుదేరాడు. జ్యూస్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లగానే, సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మురళి(35) చిత్తూరు జిల్లా, పలమనేరుకు బైక్‌లో వెళుతున్న క్రమంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శివప్రసాద్ అక్కడి కక్కడే మృతి చెందాడు. మోహిత్, మురళి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు బాధితులకు మెరుగైన వైద్యం అందించి మోహిత్, మురళిలను తిరుపతికి వెళ్లాలని రెఫర్ చేశారు.
జిల్లా ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు..
ప్రొద్దుటూరు క్రైం : వారు ఇరువురు వృద్ధులు.. వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. చికిత్స పొందుతూ వృద్ధులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాకపోవడంతో వారి మృతదేహాలను జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు.సంజీవనగర్‌కు చెందిన అనసూయాదేవి (60)ని ఈ నెల 5న ఆసుపత్రిలో చేర్పించగా ఆమె ఆదివారం రాత్రి మృతి చెందింది. అలాగే ఓబులేసు (68)ను ఈ నెల 7న జీఈ వార్డులో చేర్పించారు. చికిత్స పొందుతున్న అతను సోమవారం మృతి చెందాడు. మృతుల కుటుంబ సభ్యులు తమను సంప్రదించాలని మార్చురీ ఇన్‌చార్జి వరాలు తెలిపారు.
మల్చింగ్ పేపర్ అధిక ధరకు విక్రయాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు


