● రాళ్లు కర్రలతో పరస్పర దాడులు
● ఇద్దరికి తీవ్రగాయాలు
మదనపల్లెటౌన్ : మద్యం మత్తులో మామ, బావ,మరుదులు ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లతో కొట్టుకుని తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మదనపల్లెలో జరిగిన ఘటనపై రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక రామారావు కాలనీకి చెందిన సీతారాం (37), గోవర్థన్(32)లు మామ బావమరుదులు. వారిద్దరు మధ్యాహ్నం వరకు కాలనీలోని ఓ మద్యం దుకాణం వద్ద కలసి మద్యం సేవించారు. ఇద్దరి మధ్య ఉన్న చనువు కాస్త వివాదానికి దారితీసింది. మాటమాట పెరిగి గొడవపడ్డారు. మద్యం మత్తులో ఉన్న వీరు విచక్షణ కోల్పోయారు. పక్కనే ఉన్న రాళ్లు కర్రలు తీసుకుని ఒకరిపై మరొకరు దాడి చేసుకుని కొట్టుకున్నారు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ నాగేశ్వర రావు, ఏఎస్‌ఐ రమణ సిబ్బందితో వెళ్లి ఘర్షణను అదుపుచేసి, ఇద్దరిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీతారాం ఒక్కసారిగా రెచ్చిపోయడు. వైద్య సిబ్బంది పైకి వెళుతూ అక్కడ ఉన్న వస్తువులను చిందరవందర చేస్తూ భీభత్సం సృష్టించాడు. అతని ప్రవర్తనను అదుపు చేయడం ఎవవరివల్ల కాక పోవడంతో సీఐ మహ్మద్ రఫి ఆస్పత్రికి సిబ్బందితో వచ్చి, నచ్చజెప్ప చూసినా ఫలితం లేకుండా పోయింది. వైద్యలు చివరకు అతనికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పడుకునేలా చేశారు. అనంతరం అతనికి మెరుగైన వైద్యం అందించినా రక్త స్రావం ఆగక పోవడంతో డాక్టర్ల సలహా మేరకు పోలీసులు సీతారాం ను ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. సీతారాంను ఆస్పత్రికి తరలించిన వెంటనే గోవర్ధన్ వచ్చి ఆస్పత్రిలో వైద్యం తీసుకున్నాడు. ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


