జిల్లాలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టలు అక్రమార్కులకు ఆదాయ వనరులుగా మారాయి. ప్రకృతి వనరులను కొందరు కొల్లగొడుతున్నారు. రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా గ్రానైట్ రాళ్లు పగులగొట్టి తరలిస్తున్నారు. అనుమతులు లేకుండానే.. జోరుగా అక్రమ మైనింగ్ చేస్తున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
● జోరుగా అక్రమ మైనింగ్
● రాత్రి పూట గ్రానైట్ తరలింపు
● ఎల్లలు దాటిస్తున్న వైనం
సంబేపల్లె : రెండు నెలలుగా జాతీయ రహదారి సమీపంలోనే.. కొండను కొల్లగొడుతున్నారు. అయినా పాలకులు, అధికారులు నిద్రమత్తులో జోగారు. చివరికి స్థానికులు సమాచారం అందించడంతో.. అధికారులు మేల్కొన్నారు. చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మరి ఎప్పుడు తీసుకుంటారో వేచి చూద్దాం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంబేపల్లె మండల పరిధి నాగిరెడ్డిగారిపల్లె పంచాయతీలోని సిఎం కొత్తపల్లె సమీపాన ఉన్న కొండలో కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. మండలంలోని దేవపట్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో సర్వే నంబర్ 531లో రెండు నెలలుగా రాత్రి పూట గ్రానైట్ తవ్వకాలు చేపడుతూ, గుట్టుచప్పుడు కాకుండా ఎల్లలు దాటిస్తున్నారు. గ్రానైట్ క్వారీని ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వానికి సంబంధిత శాఖ ద్వారా మొదట దరఖాస్తు చేసుకోవాలి. వారు పరిశీలించి రెవెన్యూ శాఖకు పంపుతారు. రెవెన్యూ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి.. మైనింగ్ శాఖకు పంపుతారు. వీటన్నింటిని పరిశీలించిన మైనింగ్ శాఖాధికారులు అనుమతులు మంజూరు చేయడం జరగాలి. అందుకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు పొందకుండా.. ఇక్కడ గ్రానైట్ త్వకాలు చేసి రాత్రికిరాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం జాతీయ రహదారి సమీపంలో జరుగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులకు తెలియక పోవడం ఏమిటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
పరిశీలించిన అధికారులు
సర్వే నంబర్ : 531 నుంచి అక్రమంగా గ్రానైట్ రాళ్లు తరలిస్తున్నాంటూ రెవెన్యూ అధికారులకు సమాచారం రావడంతో.. వారం రోజుల క్రితం సంబేపల్లె తహసీల్దార్ సుబ్రమణ్యంరెడ్డి తన సిబ్బందితో వెళ్లి మైనింగ్ తీస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే అక్కడ పని చేస్తున్న యంత్రాలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అక్కడ పని చేస్తున్నది కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని విశ్వసనీయ సమాచారం. రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలంలోకి వెళ్లిన సమయంలో యంత్రాలను అక్కడే వదిలేసి పారిపోయారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్, గనుల శాఖ అధికారులు అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తహసీల్దార్ వివరణ
ఈ విషయంపై తహసీల్దార్ సుబ్రమణ్యంరెడ్డిని వివరణ కోరగా.. దేవపట్ల రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 531లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఆయన చెప్పారు. అక్కడ పని చేస్తున్న మిషనరీష్‌లను గుర్తించి, సంబేపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యదు చేశామని పేర్కొన్నారు. అక్రమంగా మైనింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
తరలించేందుకు సిద్ధంగా ఉన్న గ్రానైట్ రాళ్లు
యంత్రాలతో రాళ్లు పగులగొడుతున్న దృశ్యం


