తంబళ్లపల్లె: భారతీయ వాయుసేనలో అగ్నివీర్ పోస్టులకు అర్హులైన యువతీ,యువకుల కోసం ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిహిస్తున్నారని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి నాగార్జున ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2వతేదీ మధ్యలో జన్మించి ఉండాలన్నారు. 152 సెం.మీ ఎత్తున్న అవివాహితులు అర్హులన్నారు. ఇంటర్, డిప్లోమా లేదా రెండేళ్ల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండి ఇంగ్లిషులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు అన్ని విద్యార్హత ధ్రువపత్రాలతో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మహిళలు మార్చి 9న, పురుషులు మార్చి 12న ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు నేరుగా హాజరు కావాలని వివరించారు.
కారు, ద్విచక్రవాహనం ఢీ : మహిళ దుర్మరణం
– బాలుడికి తీవ్ర గాయాలు
వాల్మీకిపురం : కారు, ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ మహిళ దుర్మరణంగా చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం రాత్రి స్థానిక బోగంపల్లి సమీపంలోని హైవేపై చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన మురళీక్రిష్ణ భార్య లక్ష్మి(36), కుమారుడు బాలాజి (11) ఇద్దరు ద్విచక్రవాహనంపై ఎండుమిరపకాయలు తీసుకొని మదనపల్లి సంతలో అమ్ముకునేందుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి సొంతూరుకు వెళ్తుండగా స్థానిక బోగంపల్లి సమీపంలోని హైవేపై కారు ఢీకొంది. ఈ ఘటనలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా..బాలాజికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన బాలాజిని ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లికి రెఫర్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యపై దాడి చేసిన భర్తను అరెస్టు చేయాలి
మదనపల్లె టౌన్ : మద్యానికి డబ్బు ఇవ్వలేదని భార్యపై ఇటుక రాళ్లతో దాడి చేసిన భర్తను అరెస్టు చేయాలంటూ, శనివారం బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టి నిరసన తెలిపింది. మదనపల్లె పట్టణం చిప్పిలిలో ఉంటున్న రమణ, ఉమాదేవిల కుమార్తె శ్రావణి (23), స్థానిక కుమారపురంలో ఉంటున్న పవణ్ కల్యాణ్‌ను నాలుగేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే కొంత కాలం సజావుగా సాగిన వీరి కాపురంలో భర్త తాగి వచ్చి భార్యను అనుమానించడమే కాకుండా తరచూ కొడుతుండంతో శ్రావణి పుట్టినింటికి వెళ్లినట్లు తెలిసింది. వారం క్రితం తిరిగి అత్తగారి ఇంటికి వచ్చిన భార్యపై భర్త ఇటుక రాళ్లతో మూడు రోజుల క్రితం దాడి చేసి కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. న్యాయం చేయాలని బాధితురాలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా మూడు రోజులైనా భర్తపై కేసు నమోదు చేయక పోవడంతో, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి ఆందోళనకు దిగింది.


