యువకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

యువకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌

Mar 8 2026 7:42 AM | Updated on Mar 8 2026 7:42 AM

మదనపల్లెటౌన్‌ : అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన అరవాండ్లపల్లె పూల దివాకర్‌ అనే యువకుడి హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు తాలుకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. ఈ కేసులో అదే ఊరికి చెందిన పూల గణేష్‌, పి.సుబ్రహణ్యం, మేకల మణికంఠేశ్వరప్రసాద్‌లను నిందితులుగా గుర్తించి శనివారం రిమాండుకు తరలించారు. స్థానిక తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో సీఐ మీడియాకు వివరాలు వెల్లడించారు. వలసపల్లె గ్రామం అరవాండ్లపల్లెకు చెందిన పూల లక్ష్మినారాయణ, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు పూల దివాకర్‌(31) బెంగళూరులో ఓ ప్రయివేట్‌ ఉద్యోగం చేస్తుండే వాడు. ఏడాది క్రితం క్రిష్ణాపురం, అరవాండ్లపల్లె గ్రామ ప్రజలకు జరిగిన గొడవల్లో స్నేహితుడైన గణేష్‌తో కలసి కేసుల్లో ఇరుక్కున్నాడు. ఆ కేసుల్లో దివాకర్‌కు తప్ప తక్కిన వారందరికీ గణేష్‌ బెయిల్‌ తీసిచ్చాడు. దివాకర్‌కు బెయిల్‌ తీయకుండా తాత్సారం చేయడంతో.. గత ఏడాది డిసెంబర్‌ 28న స్వగ్రామానికి వచ్చిన దివాకర్‌ ఆగ్రహంతో గణేష్‌తో గొడవపడడం జరిగింది.

బండ రాళ్లతో కొట్టి..

అడ్డు తొలగించుకోవడానికి గణేష్‌ తన అనుచరులు సుబ్రమణ్యం, మణికంటేశ్వరప్రసాద్‌తో కలసి ఈ ఏడాది ఫిబ్రవరి 4న దివాకర్‌ను 150వ మైలు రాయికి సమీపంలోని క్రిష్ణప్ప మామిడి తోట వద్దకు తీసుకెళ్లి, పూటుగా మద్యం తాపించి ఆపై బండ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. శవాన్ని మామిడితోటలోని చెట్ల పాదుల్లో పాతేసి మిన్నకుండి పోయినట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకులు ఫిబ్రవరిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత నెల 28న అక్కడి వీఆర్‌ఓ నాగేశ్వర ద్వారా గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మృతదేహం వెలికి తీసి స్పాట్‌ పోస్టుమార్టం చేయించారు. దివాకర్‌ మృతదేహంగా బంధువులు గుర్తించడంతో వారికి అప్పగించారు.

నేరం అంగీకరించిన నిందితులు

మిస్సింగ్‌ కేసును హత్య కేసుగా మార్చి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం చీకిలబైలు గ్రామం బార్లపల్లె వరసిద్దేశ్వరస్వామి గుడి వద్ద నిందితులు గణేష్‌, సుబ్రమణ్యం, మణికంఠేశ్వరప్రసాద్‌ ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే జిల్లా ఎస్పీ ధీరజ్‌, అడిషనల్‌ ఎస్పీ వెంకటాద్రి ఆదేశాలతో సీఐ ఎస్‌ఐలు చంద్రమోహన్‌, రామక్రిష్ణారెడ్డి, సిబ్బందితో కలిసి వెళ్లి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు బైకులు, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రెండు బైకులు, సెల్‌ ఫోన్లు సీజ్‌ : సీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement