కురబలకోట : మహిళా సాధికారతతో సమాజంలో సమానత్వం సాధ్యం కాగలదని, సమాజంలో మహిళల పాత్ర కీలకమని జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు శ్యామల ఎస్.కుందర్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడారు. మహిళలు కుటుంబ నిర్మాణం మొదలుకుని దేశ నాయకత్వం వరకు శాస్త్ర సాంకేతిక రంగాలు, క్రీడలతోపాటు పలు రంగాలలో విశేష ప్రతిభ చాటుతున్నారన్నారు. ఎన్నో విజయాలు సాధిస్తున్నారన్నారు. ఇందిరా గాంధీ, సుష్మా స్వరాజ్, కల్పనా చావ్లా, పీవీ సింధు వంటి మహిళలు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. విద్య, ఉపాధి రంగాలతోపాటు గౌరవంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం పురోగమిస్తుందన్నారు. మిట్స్ యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ఒకప్పుడు ఉన్నత విద్యలో మహిళల శాతం తక్కువగా ఉండేదని, ఇప్పుడు 45 శాతానికి పెరిగిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యలో మహిళల శాతం 60 శాతానికి పైగా ఉందన్నారు. ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల భాగస్వామ్యం 50 శాతానికి పైగా ఉండగా దేశంలో 27 శాతం మాత్రమే ఉందన్నారు. వివిధ రంగాల్లో మహిళా బాగస్వామ్యం పెరిగితే దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఆర్థిక శక్తిగా నిలుస్తుందన్నారు. కేరళ రాష్ట్ర మహిళలు నర్సింగ్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తూ ఆ రాష్ట్రంతోపాటు దేశానికి కూడా పేరు తెస్తున్నారన్నారు. మిట్స్ విద్యార్థినులకు అంతర్జాతీయ సదస్సులకు వెవెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో ప్రో చాన్స్‌లర్ ఎన్.ద్వారకనాథ్, డీన్ స్కూల్ మేనేజ్‌మెంట్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


