రాయచోటి టౌన్ : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆర్‌జేడీ శామ్యూల్ తెలిపారు. శనివారం రాయచోటి డీసీఈబీ హాల్‌లో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలలో అనేక మార్పులు తీసుకొచ్చామని, వాటికి అనుగుణంగానే నిర్వహించాలని చెప్పారు. ఏ చిన్నపాటి తప్పిదాలు జరిగినా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్నారు. పరీక్షల నిర్వహణ జరిగే ఏడు రోజులు ఉపాధ్యాయులు తమ నిజాయతీని నిరూపించుకోవాల్సి ఉంటుందని సూచించారు. అనంతరం డీఈవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని చెప్పారు. కాపీలకు తావివ్వకుండా నిర్వహించి మంచిపేరు ప్రతిష్టతలు తీసుకురావాలని చెప్పారు. ప్రశ్నాపత్రాలు పోలీస్‌స్టేషన్ నుంచి తగిన సిబ్బందితో నిర్ణీత సమయానికి వచ్చి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామ్స్ శ్రీనివాసరాజు, రాయచోటి డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి నాగయ్య, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగమునిరెడ్డి, కో ఆర్డినేటర్ రామకృష్ణ, సూపరింటెండెంట్ రవికుమార్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


