మదనపల్లెటౌన్ : నిత్యం కష్టపడి ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించే ఓ డ్రైవర్ విధి నిర్వహణలో భాగంగా ఉండగానే గుండె పోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదరక సంఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి ముదివేడు పోలీసులు, మృతుని కుటుంబీలు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె పట్టణం కోట వీధిలో కాపురం ఉంటున్న లక్ష్మణరావు(57) ఆటోలో ఇంటి సామగ్రిని వేసుకుని ముదివేడుకు బయలుదేరాడు. ఆటో మార్గంమధ్యలోని కురబలకోట మండలం రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే లక్ష్మణరావుకు అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన ఆటోలోనే కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. వారు డ్రైవర్ బతికే ఉన్నాడని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.


