పెద్దతిప్పసముద్రం: మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో, చరమాంకంలో విశ్రాంతి తీసుకోవాల్సిన ఒక వృద్ధురాలు తన రక్తసంబంధం కోసం కష్టాలు ఎదుర్కొంటోంది. బిడ్డల అక్కున చేరి కాలం వెళ్లదీయాల్సిన వయసులో, అమ్మానాన్నలను కోల్పోయిన ముగ్గురు మనుమల బాధ్యతను భుజాన వేసుకొని భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విధి వంచించినా, పేదరికం వేధించినా.. ఆ పండుటాకు గుండె ధైర్యం చెదరలేదు. కన్నకూతురు కళ్లముందే కడతేరినా, అల్లుడు అనాథలుగా వదిలేసి వెళ్లినా.. ముగ్గురు పసికందుల కోసం జీవనపోరాటం చేస్తోంది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం బీసీ కాలనీకి చెందిన మెహరున్నీసా కన్నీటి గాథ ఇది.
వెల్లువలా వచ్చిన ఆపదలు
మెహరున్నీసా జీవితం మొదటి నుంచీ కష్టాల కడలే. 18 ఏళ్ల క్రితం భర్త కలాయి పీరాన్‌సాబ్ అనారోగ్యంతో మరణించగా, కూలీనాలీ చేస్తూ ఒక్కగానొక్క కుమార్తె రెడ్డిప్యారీని పెంచి పెద్దచేసింది. 14 ఏళ్ల క్రితం షఫీ అనే వ్యక్తితో వివాహం చేయగా.. వారికి రేష్మా, రెడ్డిబాషా, షఫీ అనే ముగ్గురు సంతానం కలిగారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో ఐదేళ్ల క్రితం కరోనా మహమ్మారి కుమార్తె రెడ్డిప్యారీని బలితీసుకుంది. భార్య చనిపోయిన మూడు నెలలకే అల్లుడు ముగ్గురు పిల్లలను అనాథలుగా వదిలేసి ఎటో వెళ్లిపోయాడు.
పింఛన్ డబ్బులే జీవనాధారం
దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ ముగ్గురు పసికందులను అమ్మమ్మ మెహరున్నీసా అక్కున చేర్చుకుంది. తనకు వచ్చే స్వల్ప పింఛన్ డబ్బులు, రేషన్ సరుకులతోనే కడుపు కట్టుకుని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. ‘నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో.. వీళ్లు మళ్లీ అనాథలైపోతారో‘ అని ఆ పండుటాకు కంటతడి పెడుతుంటే చూసేవారి హృదయాలు తరుక్కుపోతున్నాయి.
సాయం కోసం ఎదురుచూపు:
ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం తనకు ఒక ’అంత్యోదయ కార్డు’ మంజూరు చేయాలని, ప్రభుత్వం,దాతలు స్పందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది. పిల్లల చదువులకు ప్రభు త్వ వసతి గృహాల్లో లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా పరిష్కారం చూపాలని అర్థిస్తోంది.


