పీలేరురూరల్: గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే పట్టుదలతో, రాకెట్ వేగంతో దూసుకుపోతోంది అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి టి. హోత్రిశ్రీ. మాజీ సైనికుడు, జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు టి. ప్రభాకర్ రెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకుని, క్రీడా మైదానంలో పతకాల పంట పండిస్తోంది.
చిన్నారి ప్రాయంలోనే చిచ్చరపిడుగు
తన ఆరవ ఏటనే బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెట్టిన హోత్రిశ్రీ, 2017లో గోపిచంద్ అకాడమీలో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. రాజమండ్రిలో జరిగిన అండర్–15 విభాగంలో స్టేట్ ఛాంపియన్‌గా నిలవడంతో పాటు, ఢిల్లీ, బెంగళూరు, మణిపూర్ వంటి నగరాల్లో జరిగిన అండర్–17 పోటీల్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వీటితో పాటు వివిధ స్థాయిల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించింది.
పురస్కారాలు – రికార్డు విజయాలు
అబ్దుల్ కలాం పురస్కారం: 2019లో క్రీడల్లో కనబరిచిన అసమాన ప్రతిభకు గాను అప్పటి ప్రభుత్వం నుంచి ఈ గౌరవాన్ని అందుకుంది.
నేషనల్ ఛాంపియన్: 2021లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది.
సౌత్ జోన్ ఎంపిక
2024–25లో కడప జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి, చైన్నెలో జరిగే సౌత్ జోన్ మరియు ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికై ంది.
లక్ష్యం.. దేశ కీర్తిని చాటడమే!
ప్రస్తుతం కేఎంఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న హోత్రిశ్రీ, చదువును క్రీడను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ‘మా నాన్నే నాకు స్ఫూర్తి. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి గర్వకారణంగా నిలవడమే నా ఏకై క లక్ష్యం‘ అని ఆమె ధీమాగా చెబుతోంది.


