జమ్మలమడుగు: నిశ్చలమైన సంకల్పం, పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించింది జమ్మలమడుగుకు చెందిన నీరజ. తల్లి మరణంతో ఇంటి బాధ్యతలు భుజాన వేసుకుని, తండ్రి కష్టానికి తోడుగా ఉంటూనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచింది.
బాధ్యతలే పాఠాలుగా..
నీరజ తండ్రి హుస్సేనయ్య భవన నిర్మాణ కార్మికుడు. తల్లి మరణించడంతో ఇంటి పనుల భారమంతా నీరజపైనే పడింది. వంట వార్పులు చూసుకుంటూనే, తండ్రికి ఇబ్బంది కలగకుండా తన చదువును కొనసాగించింది. స్థానిక ఎస్పీ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన ఆమె, పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమైంది.
నెలల వ్యవధిలోనే రెండు కొలువులు
తొలి విజయం: గతేడాది డిసెంబర్‌లో జరిగిన పోలీస్ నియామకాల్లో ఎంపికైంది.
రెండో విజయం: కానిస్టేబుల్‌గా శిక్షణలో ఉండగానే, ఈ ఏడాది జనవరిలో వెలువడిన ఫలితాల్లో ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా ఉద్యోగం సాధించి ప్రతిభను చాటుకుంది.
పేదరికం అడ్డుకాదు:
ఎన్ని అడ్డంకులు ఎదురైనా కృంగిపోకుండా లక్ష్యం వైపు సాగడమే తన విజయ రహస్యమని నీరజ నిరూపించింది.


