సచివాలయ ఉద్యోగులకు జీతం కట్
● యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయని
9 మంది జీతాలు నిలిపి వేయాలని
ఎంపీడీవో అదేశాలు
● కలెక్టర్ అదేశాలు బేఖాతార్
రొంపిచెర్ల : రొంపిచెర్ల మండలంలో యూనిపైడ్ ఫ్యామిలీ సర్వే చేయలేదని 9 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతాలు నిలిపి వేయాలని ఎంపీడీవో మధుసూథన్ రెడ్డి అదేశాలు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల మండలంలో 9281 కుటుంబాలను యూనిపైడ్ సర్వే చేయడానికి 63 మంది సచివాలయ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఒక ఉద్యోగికి 100 నుంచి 150 కుటుంబాలు సర్వే చేయాలని అప్పగించారు. ఇప్పుటి వరకు 7589 కుటుంబాల సర్వే పూర్తి చేసి 81.77 శాతం సాధించారు. 1692 కుటుంబాలు సర్వే ఇంకా చేమయాల్సి ఉంది. చిత్తూరు జిల్లాలో జరిగిన సర్వేలో రొంపిచెర్ల మండలం మూడో స్థానంలో ఉంది. అయితే ఈ సర్వేలో హార్టికల్చర్ , వ్యవసాయ శాఖ ఉద్యోగులు రైతులకు యూరియా పంపిణీ, ఈ పంట నమోదు కార్యక్రమాలు చేస్తున్నారని, వారికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రెండు వారాల గడువు కూడా ఇచ్చారు. అయితే ఎంపీడీవో జీతాలు నిలుపుదలలో ఇద్దరు హార్టికల్చర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. సచివాలయ ఉద్యోగులకు పని భారం ఎక్కువ కావడంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ సమయంలో ఉద్యోగుల జీతాలను నిలుపుదల చేసి వారిని మనోవేదనకు గురి చేయడం సబబు కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సచివాలయ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.
రొంపిచెర్ల మండలంలో యూనిపైడ్ సర్వే చేయలేదని జీతాలు నిలిపి వేసిన వారిలో మోటుమల్లెల విలేజ్ సర్వేయర్ కె.హేమంత్, పెద్దమల్లెల వెటర్నరీ అసిస్టెంట్ పి.తేజకృష్ణ, బొమ్మయ్యగారిపల్లె సచివాలయ వెల్పర్ అసిస్టెంట్ డి.అప్సర్, హర్టికల్చర్ అసిస్టెంట్ జి.తిరుమల, విలేజ్ సర్వేయర్ సబ్‌నమ్, రొంపిచెర్ల–1 విలేజ్ సర్వేయర్ ఎం.హేమంత్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ రెడ్డి అహమ్మద్, రొంపిచెర్ల–2 విలేజ్ సర్వేయర్ తులసి కుమార్, హర్టికల్చర్ అసిస్టెంట్ ఉదయ శ్రీ ఉన్నారు.


